బంజారాహిల్స్,ఆగస్టు 16: దేశానికే దిక్సూచిలాంటి పథకాలను రూపొందించి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా మరో చరిత్ర సృష్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఫిలింనగర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందున్న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. దళిత బంధును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గుర్తించారని, వారికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అనంతరం పెద్దసంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, అబ్దుల్ ఘని, నగేశ్, దయ్యాల దాసు,రవి తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్/జూబ్లీహిల్స్, ఆగస్టు 16: దశాబ్దాలు గడిచిన పట్టించుకోని దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హుజూరాబాద్‌లో ప్రారంభించిన దళితబంధు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావుతో పాటు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలోనే మొట్టమొదటిసారిగా దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాలు మారనున్నాయన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా దళితబంధు పథకాన్ని రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.