మియాపూర్, ఆగస్టు 27 : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మౌలిక వసతులతో పాటు సౌకర్యవంతమైన రహదారుల కల్పన దిశగా విస్తృతంగా పనులను చేపడుతున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని చైతన్యనగర్, సుమిత్రనగర్, బాగ్మీర్ కాలనీల్లో రూ.2.23కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడీ పునరుద్ధరణ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో ప్రతి అభివృద్ధి పనిలో ఆదర్శంగా ముందుకు సాగుతున్నట్లు, నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందివ్వటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నందున పనుల్లో ఏమాత్రం నాణ్యతాలోపాలు లేకుండా అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధితో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ స్వప్ప, సుధాకర్, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, నాయినేని చంద్రకాంత్‌రావు, కార్తీక్‌రావు, అల్లం మహేశ్, రాంచంద్రారావు, హిమగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.