మాదాపూర్, ఆగస్టు 23: కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో స్థానిక డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కాలనీవాసులు కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కాలనీల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్‌గౌడ్, జలమండలి మేనేజర్ పూర్ణేశ్వరి, గౌరవ అధ్యక్షుడు వాలా హరీశ్‌రావు, కాలనీ వాసులు ఉమా మహేశ్వరరావు, బాలయ్య, సురేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీధర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మజీద్‌బండ గ్రామంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రాజయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి ఉరేగింపులో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ నీరుడి గణేశ్, శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు రాజుయాదవ్, రవియాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, రమేశ్, కృష్ణ యాదవ్, కొడిచెర్ల రాము తదితరులు పాల్గొన్నారు.