మాదాపూర్, ఆగస్టు 19: మాదాపూర్‌లోని సర్వే నంబర్ 80లో మహిళా భవన్‌ను ఏర్పాటు చేయాలని కాలనీకి చెందిన తెలంగాణ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గురువారం స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీతో పాటు కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం మహిళా భవన్ నిర్మాణం చేపట్టేందుకు రూ. 10 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మహిళా మండలి అధ్యక్షురాలు రాణమ్మ తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే, విప్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తుందని, మహిళా భవన్ నిర్మాణాన్ని చేపట్టేందుకు తగిన కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా మండలి నిర్మాణాన్ని చేపట్టేందుకు మరిన్ని నిధులను కేటాయించి మహిళల అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాణమ్మ, వైస్ ప్రెసిడెంట్ సంగీత, ఊర్మిళ, జాయింట్ సెక్రటరీ రాధ, జనరల్ సెక్రటరీ విద్య, గీత, ప్రమీల, సావిత్రి, సంతోషి, కస్తూరి ఉన్నారు.