మియాపూర్, ఆగస్టు 10 : చెరువుల ప్రక్షాళణే లక్ష్యంగా పరిశుభ్రమైన జలాలలో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన 7 ఎస్టీపీల నిర్మాణాలకు స్థల సేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెలాఖరులో నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ వెల్లడించారు. పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మకుంట చెరువు వద్ద రూ. 43.46 కోట్లతో 13.50 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపి నిర్మాణం నిమిత్తం జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ఒక్కో ఎస్టీపీ నిర్మాణం నిమిత్తం సుమారు 2 ఎకరాల వరకు స్థలం అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు, అందుకు అనువైన స్థలాలు ఆయా చెరువుల వద్ద అందుబాటులో ఉన్నాయని రెవెన్యూ, ఇరిగేషన్, జలమండలి ఎస్టీపీ విభాగం అధికారుల సమన్వయంతో స్థలాలను పరిశీలించి సేకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 7 ఎస్టీపీలకు కావలసిన స్థలాల సేకరణను కొద్ది రోజులలో పూర్తి చేసి నెలాఖరుకు వాటి నిర్మాణాలను ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు విప్ గాంధీ వెల్లడించారు.
ప్రధానంగా ఎస్టీపీల నిర్మాణంతో మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లే అవకాశం లేదని, శుద్ధి ప్రక్రియతో పరిశుభ్రమైన జలాలతో చెరువులు ఆహ్లాదంగా తయారవుతాయన్నారు. నిర్మాణ పనులలో పూర్తిస్థాయిలో నాణ్యత పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణను చేపట్టాలన్నారు. చెరువులను ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దుతామని విప్ గాంధీ తెలిపారు. స్థల సేకరణలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ సీజీఎం ప్రసన్నకుమార్, జీఎం వాసు సత్యనారాయణ, డీజీఎంలు దీపాలి, రజని, ఎస్టేట్ అధికారి సత్యనారాయణ, మేనేజర్లు శంకర్, వెంకట్, మెగా ప్రాజెక్టు ప్రతినిధి నిస్సార్, పార్టీ నేతలు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశీనాథ్యాదవ్ పాల్గొన్నారు.