Hyderabad | మియాపూర్: మద్యం తాగేందుకు డబ్బుల్లేక తాకట్టు పెట్టిన ఫోన్‌ను విడిపించేందుకు నెలకొన్న వివాదంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మియాపూర్ ఠాణాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మియాపూర్ సీఐ క్రాంతి, మాదాపూర్ ఎస్వోటీ సీఐ సంజయ్‌కుమార్‌లతో కలిసి మియాపూర్ ఏసీపీ నర్సింహారావు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కేశవ్ బంగార్(39 ) స్వరాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలో పని చేశాడు. ఉపాధి నిమిత్తం 15 రోజుల కిందట మియాపూర్ ఠాణా పరిధిలోని హఫీజ్‌పేట్‌కు వచ్చాడు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసిస్తూ లేబర్ అడ్డాలో పని కోసం వెళ్తున్నాడు.
అదే అడ్డాలో కర్ణాటక రాష్ర్టానికి చెందిన సహచర కూలీలు గందె సునీత్(23), సునీల్ మద్దానికర్(25), ప్రేమ్ సాగర్ నోడ్గి (24) పరిచయమయ్యారు. ఈ నెల 4న మద్యం తాగేందుకు సునీత్, మద్దానికర్ వద్ద డబ్బులు లేకపోవడంతో కేశవ్ బంగార్ ఫోన్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తేవాలని, తదుపరి విడిపించి ఇస్తామన్నారు. అదే ప్రకారం డబ్బులు తేగా అందరూ కలిసి మద్యం సేవించారు. అదే రోజు సాయంత్రం రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం సేవిస్తున్న సునీత్, మద్దానికర్ను కేశవ్ తాగిన మైకంలో తన ఫోనును విడిపించి ఇప్పించాలని గొడవపడ్డాడు.
తమ సహచర మరో కూలీ అయిన ప్రేమ్ సాగర్ నోడ్గిని సైతం అక్కడికి పిలుపించుకోగా…ముగ్గురి మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని వారిపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో సునీత్, మద్దానికర్, నోడ్గి కేశవ్ సాగర్‌పై సిమెంటు ఇటుకతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో కేశవ్ తలపై తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు.. కేశవ్ బంగార్‌ను సునీల్, మద్దానికర్, ప్రేమ్‌సాగర్ హత్య చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. హంతకులను కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.