హైదరాబాద్: హైదరాబాద్‌లోని మీర్పేర్ కార్పొరేషన్ పరిధిలో కనిపించకుండా పోయిన ఎనిమిదో తరగతి విద్యార్థి (Meerpet Student) ఆచూకీ లభించింది. మీర్‌పేటలోని దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపతుల రెండో కుమారుడు మహేందర్‌రెడ్డి గత ఆదివారం (ఈ నెల 4) సాయంత్రం ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే రాత్రి పొద్దుపోయినా తిరిగిరాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా.. ఓ బైక్‌పై వెళ్తున్నట్లు కనిపించాడు. దాని ఆధారంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. మలక్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు గుర్తించారు.
అక్కడి నుంచి తిరుపతి వెళ్లే రైలు ఎక్కినట్లు తేలింది. దీంతో తిరుపతి పోలీసులకు సమాచారం అందించగా.. అతడు తిరుపతిలో దిగినట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి తల్లిదండ్రులతోపాటు మీర్‌పేట పోలీసులు తిరుపతికి బయల్దేరివెళ్లారు. కాగా, బాలుడు ఇంట్లోనుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు నగదు తీసుకెళ్లినట్లు అతని పేరెంట్స్ వెల్లడించారు.