ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 13: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తప్పుడు సమాచారాన్ని తొలగించడం కీలమని చెప్పారు. ఉర్దూ టీవీ జర్నలిస్టుల కోసం తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంపై యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఓయూ క్యాంపస్‌లోని సీఎఫ్ఆర్డీ భవనంలో జరిగిన వర్క్‌షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాంకీ స్టర్మ్ మాట్లాడుతూ… మీడియా అందించిన సమాచారం ఆధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారని చెప్పారు. అందుకే కలుషితం లేని వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు అందించాలని జర్నలిస్టులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్ క్రైం డీసీపీ స్నేహా మెహ్ర మాట్లాడుతూ పరిమిత వనరుల కారణంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందని, ఫలితంగా ప్రజల వాస్తవిక అవగాహనను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం అత్యవసరమని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. ఓయూలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఓయూ జర్నలిజం విభాగం హెడ్ ప్రొఫెసర్ కె. స్టీవెన్సన్ తదితరులు ప్రసంగించారు. ఈ శిక్షణకు 35 మంది ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్లు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.