బేగంపేట్ ఏప్రిల్ 14: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపు చేయడం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. అగ్నిమాపక దళ వారోత్సవాల సందర్భంగా శు్రక్రవారం బేగంపేట్‌లోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రారంభించారు. అనంతరం అగ్ని ప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర పరికరాలను పరిశీలించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ఇటీవల రూబీ హోటల్, దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్‌లలో జరిగిన అగ్ని ప్రమాదాలు చాలా బాధకరమన్నారు. ఆయా ఘటనల్లో పలువురు మరణించారని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి, తద్వారా ఆస్తి, ప్రాణనష్టం మరింత జరగకుండా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా 43 ఫైర్ స్టేషన్లను మంజూరు చేయడమే కాకుండా బడ్జెట్లో 32 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను అదుపు చేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సీఎం, హోంమంత్రి దృష్టి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్‌రావు,అదనపు జిల్లా ఫైర్ అధికారి ధనుంజయరెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ మోహన్‌రావు, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్‌గౌడ్, శేఖర్‌ముదిరాజ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.