మారేడ్‌పల్లి, మార్చి 2: రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 8 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసంలో కంటోన్మెంట్‌కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు, కరెంట్, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అల్వాల్ ప్రాంతంలో కోట్ల రూపాయల వ్యయంతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో దవాఖానను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 10వ తేదీన కంటోన్మెంట్లో జనరల్ బాడీ సమావేశం ఉంటుందన్నారు. వచ్చే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న మృతి చెందడం చాలా బాధాకరమని, సాయన్న కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. అలాగే నేడు జూబ్లీబస్టాండ్ చౌరస్తాలో వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, దివంగత సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదిత, బీఆర్ఎస్ నాయకులు, సదానంద్‌గౌడ్, తేజ్‌పాల్, సి. సంతోశ్ యాదవ్, నరసింహ పాల్గొన్నారు.