హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా నాలాల పూర్తిస్థాయి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వానాకాలం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక నుంచి ఆ సమస్య ఉండదన్నారు. రూ. 45 కోట్ల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు నాలాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వరదల సమయంలో వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారే తప్ప.. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.