బేగంపేట్ డిసెంబర్ 22 : వచ్చే ఫిబ్రవరి నాటికి బేగంపేట్ నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం బేగంపేట్‌లోని నాలాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాలో పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పారు. నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… నాలాలు ఆక్రమణకు గురి కావడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో నాలా పరిసర కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో ఎవరూ వీరి సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ఎన్నో సంవత్సరాల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని నాలాలను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగానే రూ. 45 కోట్ల వ్యయంతో బేగంపేట్ నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మహేశ్వరి, అధికారులు కిషన్, జియాఉద్దీన్, భాస్కర్‌రెడ్డి, జలమండలి ఈఎన్సీ కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమీర్‌పేట్ డివిజన్ గాయిత్రీనగర్లోని నాలాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎస్ఎన్డీపీ, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.