బేగంపేట్ జూన్ 11: సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన చర్యలు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి, మంత్రిగా పని చేసిన వారు కూడా చేయని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో చేసినట్టు వివరించారు. గతంలో నియోజకవర్గ పరిధిలో రోడ్లపై మురుగునీరు ప్రవహించి రోడ్లు మొత్తం అధ్వాన్నంగా ఉండేవని గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత లీకేజీ సమస్యలు పరిష్కరించామని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు తమ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్ వార్డు ఆఫీసులను ప్రారంభిస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వార్డు కార్యాలయంలోనే ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. నియోజవకర్గ పరిధిలో అనేక దేవాలయాలకు నూతన కమిటీలను నియమించామని, మిగిలిన దేవాలయాలకు కూడా కమిటీల నియామకం త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం వచ్చే నెలలో ప్రారంభించనున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ పథకం గురించి వివరించి సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. అదే విధంగా ఆర్థికంగా ఎంతో వెనుకబడిన దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అనే గొప్ప పథకాన్ని ప్రారంభించారని ఈ పథకం కింద రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. మొదటి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 10 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్టు వివరించారు. త్వరలోనే రెండో విడుత పంపిణీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇవే కాకుండా ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వినియోగించుకునే విధంగా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలతలసాని సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి హేమలత, లక్ష్మీ బాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి, రూప, శ్రీహరి, శ్రీనివాస్‌గౌడ్, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.