బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఆత్మీయ సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తూ జోడెడ్ల సవారీ చేస్తున్నది. ఆత్మీయ సమావేశాలతో మొదలై.. అక్టోబరు నెలలో జరిగే భారీ బహిరంగ సభ వరకు వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నది. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఏప్రిల్ 25న ప్రజాప్రతినిధుల సమావేశం, ఏప్రిల్ 27న జెండా పండుగ, ఏప్రిల్ 30న సచివాలయ ప్రారంభం సందర్భంగా తీర్మానాలు, క్షీరాభిషేకాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మే డే, జూన్ 1 అమర వీరుల స్మృతి భవన ప్రారంభం, జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు, ఆగస్టు 16న దళితబంధు వార్షికోత్సవాలు, అక్టోబరులో వరంగల్ మహాసభ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణా భవన్లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మీర్‌పేటలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు హాజరైన ఈ కార్యక్రమాలతో కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది.
సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుపరిపాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పార్టీలోని అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల సాధక, బాధకాలను తెలుసుకొనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశాల నిర్వహణ కోసం జిల్లా ఇంచార్జీగా దాసోజు శ్రవణ్‌ను నియమించారని తెలిపారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు నోటికి అడ్డూ అదుపులేకుండా మాట్లాడుతున్నారని, తమ పద్ధుతులను మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్‌ను గెలవలేకనే బీజేపీ కుట్రలు : దాసోజు శ్రవణ్
బీఆర్ఎస్ పార్టీ..ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని, దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకువెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి సాధించిందని, ప్రపంచమే హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా అహర్నిశలు మంత్రి కేటీఆర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన సీఎం కేసీఆర్‌ను గెలవలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి అనవసరపు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోనూ బీజేపీ కుట్ర ఉందని, రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోనూ బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరించిందన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరం కష్టపడదామని దాసోజు శ్రవణ్ సూచించారు. కష్టపడే ప్రతి ఒక్క నాయకుడికి పార్టీ తగిన సమయంలో సరైన పదవితో గౌరవిస్తుందన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విప్లవ్ కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
వరుస ప్రోగ్రాంలతో గులాబీ దూకుడు
బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. ఇందుకు ఆత్మీయ సమావేశాలతో జోష్ పెంచింది. గ్రేటర్‌ను హోరెత్తించేలా వరుస కార్యక్రమాలను తీసుకుంది. ఈ మేరకు ఆత్మీయ సమావేశాలతో మొదలై..అక్టోబరు నెలలో వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభ వరకు వరుస కార్యక్రమాలను తీసుకుంది. వచ్చే నెల 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ రోజు ప్రతి నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సభకు హాజరు కావాలని శ్రవణ్ చెప్పారు. ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల సమావేశం, ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ సందర్భంగా జెండా పండగ, ఏప్రిల్ 30న బీఆర్ అంబేద్కర్ పేరిట కొత్త సచివాలయ ప్రారంభం సందర్భంగా తీర్మానాలు, క్షీరాభిషేకాలు చేయాలని నిర్ణయించినట్లు శ్రవణ్ పేర్కొన్నారు.
మే 1న కార్మికులతో కలిసి కార్మిక దినోత్సవ వేడుకలు, మే నెలలోనే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి బీజేపీ కుట్రలను తిప్పికొట్టేలా సిద్ధం కావడం, యూత్ విభాగాన్ని బలోపేతం చేయడం లాంటివి చేపడతామని పేర్కొన్నారు. జూన్ 1 ఆమర వీరుల స్మృతి భవనం ప్రారంభం, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు, ఆగస్టు 16న దళితబంధు రెండో వార్షికోత్సవ వేడుకలు, లబ్ధిదారులతో సమావేశాలు ఉంటాయన్నారు. అక్టోబర్ నెలలో వరంగల్ మహా సభ ఉంటుందని, వరుస ప్రోగ్రాంలను విజయవంతం చేయాలని శ్రేణులకు శ్రవణ్ పిలుపునిచ్చారు.
ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం..
బీఆర్ఎస్ పార్టీని మూడో సారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కంకణబద్ధులై ప్రజాక్షేత్రంలో పనిచేయాలని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉద్యమ సమయంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు కష్టపడి పనిచేశారని, అందుకు ఫలితంగానే రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు. ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లోనూ గులాబీ సైన్యం మరింత కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు.
– హోంమంత్రి మహమూద్ అలీ
సమన్వయంతో పనిచేద్దాం
బీఆర్ఎస్ పాలనలో నగర రూపురేఖలే మారాయి. పార్టీలో సమన్వయం లోపం లేకుండా పార్టీ కార్యక్రమాల సమాచారం అందరికీ అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. పార్టీ తీసుకునే కార్యక్రమాలు, సమావేశాలకు సంబంధించి అందరికీ సమాచారం ఇచ్చి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు.
– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
పార్టీ పటిష్టత కోసం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ఎనిమిదిన్నరేండ్లలో హైదరాబాద్ నగరాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేసి పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు. పార్టీ పటిష్టత కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పని చేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
– దానం నాగేందర్, ఎమ్మెల్యే, ఖైరతాబాద్
కేసీఆర్ పాలనకు నీరాజనాలు
తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పాలనపై యావత్ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వల్లే గ్రేటర్ హైదరాబాద్ మోడల్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.
– కాలేరు వెంకటేశ్, అంబర్‌పేట ఎమ్మెల్యే