కంటోన్మెంట్, ఆగస్టు 30: అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న రసూల్‌పురా సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ క్రమంలో సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని పశుసంవర్ధక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో ఆయనను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సహా, గణపతి, శ్రీ వేంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం ఆలయ కమిటీలకు సంబంధించిన విషయాలపై సుధీర్ఘంగా చర్చించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనుల తీరుతెన్నులపై మంత్రి,ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో రసూల్‌పురాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా తొలుతగా 168 ఇండ్లు పూర్తవడంతో లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాన్ని వచ్చే నెల 9వ తేదీన ఖరారు చేశారు. అనంతరం మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ డబుల్ ఇండ్లను అర్హులైన పేదలకే అందజేస్తున్నామని, ఇండ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని, దళారులను నమ్మి మోసపోవద్దని సూ చించారు.అభివృద్ధి,సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అదే విధంగా మారేడ్‌పల్లిలో నిర్మించిన సు మారు 456 ఇండ్లను సెప్టెంబర్ చివరి వారంలో లబ్ధిదారులకు అందించేందు కు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.