
బేగంపేట్ ఆగస్టు 7: పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్లోని గైదిన్బాగ్, నల్లగుట్ట ప్రాంతాలలో ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శనివారం కలిసి పర్యటించారు. ఈ క్రమంలో స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గైదిన్బాగ్ ఏరియాలో ఎన్నో సంవత్సరాలుగా గుడిసెలలో పేదలు జీవిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు. ఇక్కడ నివసిస్తున్న పేదల వివరాలు రేషన్ కార్డులు లేని వారి వివరాలు సేకరించాలని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించాలని ఆర్డీవో వసంత కుమారిని ఆదేశించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ తహసీల్దార్ బాలశంకర్, జలమండలి జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.