
బన్సీలాల్‌పేట్, జూలై1: నగరంలోని పలు బస్తీల్లో నివసించే పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని జీవైఆర్ కాంపౌండ్ బస్తీలోడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య,పాడి,పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూ టీ మేయర్ శ్రీలతా రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, ముషీరాబాద్ తాసీల్దార్ జానకి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసిం గ్ సీఈ సురేశ్, ఎస్ఈ కిషన్, ఈఈ ఎం.వెంకట్‌దాస్ రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం వేదికపై ప్రజల సమక్షంలో లాటరీ పద్ధ్దతిలో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి, మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 50ఏండ్లుగా కనీస సదుపాయాలు లేక, ఇరుకైన ఇండ్లలో జీవించిన జీవైఆర్ బస్తీవాసుల కష్టాలు ఇప్పుడు తొలగిపోయాయన్నారు. రూ. 16కోట్లతో 180 ఇండ్లను సకల సదుపాయాలతో నిర్మించామన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు.ఇండ్ల సముదాయం ఆవరణలో నిర్మించిన దుకాణాలను కూడా లాటరీ పద్ధ్దతిలో ఎంపిక చేసి స్థానికులకే కేటాయిస్తామన్నారు.
ఇండ్ల సముదాయంలో మొక్కలు నాటాలని,పరిశుభ్రతను పాటించాలని మంత్రి సూచించారు. బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అరుణ, రూప, శేషుకుమారి, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్‌కుమార్ గౌడ్, కే.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మలు, లంబాడి నృత్యాలతో మంత్రు లు, అధికారులకు స్వాగతం పలికిన బస్తీ నాయకులు మంత్రి తలసానిని గజమాలతో సన్మానించారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామన్నారు. అనంతరం తన సొంత ఖర్చుతో ఇండ్ల సముదాయంలో అమ్మవారి ఆలయం నిర్మిస్తానని మంత్రి తలసాని భూమి పూజ చేశారు.