హైదరాబాద్ : వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ జిల్లాలో వీఆర్ఏలను వివిధ శాఖలలకు కేటాయిస్తూ నియామక పత్రాలను మంత్రులు తలసాని, మహమూద్ అలీ అందజేశారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 182 మంది వీఆర్ఏలను విద్యార్హతల ఆధారంగా వివిధ కేటగిరీలలో నియమించామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో APPSC ద్వారా కేవలం నెలకు 3 వేల రూపాయలతో కన్ సాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
ఏ ప్రభుత్వాలు కూడా ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు. గ్రామంలో ఏ ఇతర శాఖ అధికారి వచ్చినా వీఆర్ఏలు అందుబాటులో ఉండేవారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బదులు పడ్డారని గుర్తు చేశారు. వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులు. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు.