హైదరాబాద్ : నిరుపేదలకు నిలువ నీడను కల్పించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి పలువురు లబ్ధిదారులకు JNNURM ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
మూసీనది సుందరీకరణలో భాగంగా నిర్వాసితులు అవుతున్న సైదాబాద్ మండలానికి చెందిన దాదాపు 368 మందికి మునుగునూర్ ప్రాంతంలో గతంలో నిర్మించిన JNNURM ఇండ్లను కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు.
అందులో భాగంగా శుక్రవారం 10 మంది లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.
మిగిలిన నిర్వాసితులకు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులు అందరికి పత్రాలను పంపిణీ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సైదాబాద్ తహసిల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.