కొండాపూర్, ఆగస్టు 7 : అంతరించి పోతున్న గిరిజన, ఆదివాసుల కళల సంరక్షణకు ప్రత్యేక కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ఆద్య కళా ప్రదర్శనను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన గిరిజన, ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న కళా ఉత్పత్తులు, వాయిద్య పరికరాలను తిలకించారు. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రదర్శనలో ఉంచిన ప్రతి వస్తువు వారి జీవన విధానం, ఆదివాసీల కళా గొప్పదనాన్ని తెలుపుతుందన్నారు. ఎంతో కష్టపడి సేకరించిన ఆదివాసుల వాయిద్యాలు, ఇతర పరికరాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని నిర్వహకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ గూడూరు వనజ అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పూర్వ వీసీ కిషన్‌రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్ పాల్గొన్నారు.