
బడంగ్‌పేట, జూలై 25 : బాలాపూర్ మండలంలో ఉన్న చెరువులకు మహర్దశ రానుంది. జిల్లెలగూడ సందచెరువును ఇప్పటికే రూ.6కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి కాగా మంత్రాల చెరువుకు రూ.3కోట్లు, మీర్‌పేట పెద్ద చెరువుకు రూ.7 కోట్లు, అల్మాస్గూడ కోమటి కుంటకు, పోచమ్మ కుంటకు, సున్నం చెరువుకు, బాలాపూర్ పెద్ద చెరువుకు కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అల్మాస్గూడ కోమటి కుంట, పోచమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. పెద్ద చెరువు పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. జెల్పల్లి పెద్ద చెరువు రూ.6 కోట్లతో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. చెరువుల చుట్టూ బండ్ ఏర్పాటు చేయడం, పార్కులు, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
మండలంలో ఉన్న 42 గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రణాళికలు రూపొందించారు. బాలాపూర్ మండలంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారిచేయడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే చెరువుల అభివృద్ధి గురించి పలుదఫాలు అధికా రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిం చారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను తీర్చిదిద్దా లన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. చెరువుల చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉట్టి పడే విధంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. చెరువుల పరిసరాలలో యోగా కేంద్రాలు, మెడిటేషన్ కేంద్రాలు ఏర్పాటుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారిచేశారు.
బాలాపూర్ మండలంలో ఉన్న గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేయిస్తున్నాం. మొదటి దశలో జిల్లెలగూడ, జెల్పల్లి, మీర్‌పేట చెరువులను తీసుకోవడం జరిగింది. రెండవ దశలో అల్మాస్‌గూడలోని పోచమ్మ కుంట, కోమటి కుంటను అభివృద్ధి చేస్తున్నాం. ఈ రెండు చెరువులు పూర్తి కాగానే బాలాపూర్, నాదర్గుల్ చెరువులను సుందరీకరణ చేయిస్తాం. భవిష్యత్ తరాల కోసం చెరువులను తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెరువుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నారు. చెరువుల చుట్టు ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయిస్తాం. అన్ని చెరువులలోకి మురుగు నీరు పోకుండా చుట్టు ట్రంక్‌లైన్ ఏర్పాటు చేయించాం. ఇక నుంచి చెరువులు కలుషితం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. చెరువుల అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.