మహేశ్వరం, సెప్టెంబర్16: ప్రతి ఒక్కరూ కొవిడ్-19 టీకాలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏఒక్కరూ కూడా భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె కోరారు. కరోనా కష్ట కాలంలో మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్లు కృష్ణమోహన్ రెడ్డి, జ్ఞానేశ్వర్, ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్‌చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, సెప్టెంబర్16: కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ వాక్సినేషన్ సెంటర్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పర్వతాపూర్ 5వ డివిజన్లో కొవిడ్-19 వాక్సినేషన్ సెంటర్‌ను స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ స్వాతి కృష్ణాగౌడ్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, చంద్రారెడ్డి, వార్డు కమిటీ సభ్యులు,కాలనీవాసులు పాల్గొన్నారు.