పహాడీషరీఫ్, ఆగస్టు 28 : జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్ అబ్దుల్లా సాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలను లేవనెత్తారు. జల్పల్లి, శ్రీరామకాలనీ, పహాడీషరీఫ్ ప్రధానరహదారుల సమస్యలను మంత్రికి విన్నవించడంతోపాటు ఉస్మాన్‌నగర్ సమస్యను ప్రస్తావించారు. మున్సిపల్ అధికారులు రూ.17.14 లక్షలతో రూపొందించిన ఎజెండాను ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులందరూ ఆమోదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే రూ.కోటికి పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, త్వరగా అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చూడాలన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీకి ప్రతినెల వచ్చే నిధులు సిబ్బంది జీతాలతోపాటు చెత్త తరలింపు, తదితర వాటికి వినియోగిస్తున్నామన్నారు. రూ.17.14 లక్షల నిధుల్లో 75 శాతం డ్రైనేజీ, 25 శాతం వివిధ అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. పార్టీలకతీతంగా కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామన్నారు. స్వచ్ఛ జల్పల్లిగా మార్చడానికి అందరూ ముందుకు రావాలన్నారు. జల్పల్లి చెరువు సుందరీకరణకు రూ.9కోట్లు విడుదలయ్యాయన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ట్రంక్లైన్తో ఉస్మాన్‌నగర్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
అన్ని పాఠశాలలో తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.50 లక్షలు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ విధిగా 100 మొక్కలు నాటి కాపాడాలని, ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందించాలన్నారు. పహాడీషరీఫ్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని బాలాపూర్ వైద్యాధికారులకు సూచించారు. అనంతరం రూ.30 లక్షలతో కొనుగోలు చేసిన నూతన జేసీబీనీ ప్రారంభించారు.
కార్యక్రమంలో కమిషనర్ జీపీ కుమార్, వైస్‌చైర్మన్ పర్హాన నాజ్, మేనేజర్ క్రాంతి కుమార్, టీపీవో హబిబా, డీఈ విశ్వేశ్వర్రావు, బాలాపూర్ ఆరోగ్య వైద్యాధికారి నర్సింగ్‌రావు, కో-ఆప్షన్ మెంబర్లు సూరెడ్డి కృష్ణారెడ్డి, హసన్ గాలిబ్, కౌన్సిలర్లు బుడుమాల యాదగిరి, ప్రశాంతి శ్రీధర్‌గౌడ్, షేక్ పహిమిదా, లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, భాషమ్మ, శంషొద్దీన్, అహ్మద్ కసాది, మజర్ అలీ, టీఆర్ఎస్ నాయకులు ఇక్భాల్ బిన్ ఖాలీఫా, యూసుఫ్ పటేల్, షేక్ అప్జల్, యంజాల జనార్దన్, వాసుబాబు, శ్రీనివాస్‌గౌడ్, కొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.