బడంగ్‌పేట, ఆగస్టు14 : ఆర్య వైశ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలాపూర్ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెరటి పల్లి శ్రీనివాస్ గుప్తా సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు 4 చైర్మన్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్య వైశ్యులను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రోత్సాహం ఇస్తున్నారన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్య వైశ్యుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత, ఆర్యవైశ్య సంఘం చైర్మన్ చింత రవికుమార్ గుప్తా, గణేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకటేశ్, సురేశ్, కిరణ్ కుమార్, ఇల్లూరి రూపాదేవి, రేణుగంట్ల గణేశ్, ప్రకాశ్, ఓంకార్ తదితరులు ఉన్నారు.