సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి అజయ్‌కుమార్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి సేవల విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఓ రామచంద్రం ఆధ్వర్యంలో అన్ని విభాగాలను కలియతిరిగి సేవలు అందుతున్న విధానాన్ని పరిశీలించారు. ఆన్లైన్ సేవలకు వస్తున్న ఆదరణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లైసెన్స్, ఆర్సీ, ఇతర కార్డుల జారీ విధానంలో ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.? అని ఆరా తీశారు. నిర్ణీత గడువులోపలే కార్డులు జారీ అవుతున్నాయని అధికారులు తెలిపారు. లెర్నింగ్, లైసెన్స్, ఆర్సీ ప్రక్రియ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దరఖాస్తు దారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాసేవలు అందించేలా కృషి చేస్తున్నామని అన్నారు. కార్యాలయాలకు రాకుండానే ఇంటి నుంచే సేవలు పొందేల టీ యాప్ ఫోలియో యాప్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. డూప్లికేట్ లైసెన్స్, లైసెన్స్ హిస్టరీ షీట్, చిరునామాల మార్పు తదితర సేవలతో కూడిన 17 ఆన్లైన్ సేవలను యాప్ ద్వారా పొందవచ్చని వివరించారు. పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. గతంలో ఇదే ప్రాంగణంలో తన కార్యాలయం ఉండేదని.. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్లాక ఓసారి సేవలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. రవాణా శాఖకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం గుండెకాయలాంటిదని అభివర్ణించారు. కాగా, సేవలు సకాలంలో అందుతున్నాయని దరఖాస్తుదారులు చెప్పడంతో అధికారులను మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాస రాజు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్, తదితరులు ఉన్నారు.