మేడ్చల్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): అభివృద్ధి-సంక్షేమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జై కొడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో లబ్ధి పొందిన అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి మల్లారెడ్డి, కేపీ. వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు నియోజకవర్గాలలో నిర్వహిస్తున్న ప్రచారానికి స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ఇంటింటికీ తిరిగి వివరిస్తూన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని పథకాలు విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి జరగనున్న ఎన్నికలకు ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. ఇంటింటి ప్రచారంతో పాటు నిర్వహిస్తున్న రోడ్ షోలు, బహిరంగ సభలు విజయవంతంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దుతు ఇస్తున్నారని అనడానికిదో నిదర్శనం.
జిల్లాలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి బుజ్జగింపులతోనే సరిపోతుంది. పూర్తి స్థాయిలో ఇరు పార్టీలు ప్రచారం ప్రారంభించకపోవడంతో ఇరు పార్టీల శ్రేణులు విస్మయానికి గురవుతున్నారు. ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉన్నందున ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం ఎప్పుడు చేస్తారని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతవరకు అభ్యర్థుల, ద్వితీయ శ్రేణి నాయకులతో సక్యత కుదరకడ పోవడంతో ప్రచారం ఎలా పుంజుకుంటుందన్న ఆందోళనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు కలుస్తూ ప్రజల మద్దతు పొందుతున్నారు.