బోడుప్పల్/మేడ్చల్ కలెక్టరేట్, నవంబరు 7: కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం నాగారంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా బోడుప్పల్ 28వ డివిజన్ పరిధిలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో వస్తే 3 గంటల కరెంట్ ఇస్తామంటున్నారని, పంటలకు 3 గంటల కరెంట్ సరిపోతుందా అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
మరికొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని ఆ పనులు పూర్తి కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.నాలుగున్నరేళ్లలో నాగారంను ఎంతో అభివృద్ధి చేశామని, 100 ఫీట్ల రోడ్డుతో పాటు కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల తర్వాత తిరిగి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందానమని చెప్పారు. చేసిన అభివృద్ధి కండ్ల ముందు కన్పిస్తుంటే కాంగ్రెస్ను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటేసి, బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి ఆనందంగా నాయకులతో కలిసి, నృత్యం చేశారు. నాయకులు,కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డికి ఘనంగా స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మల్లేశ్, నాయకులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.