మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 29: దళితులను ధనికులుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులైన 113 మంది.. ఒక్కొక్కరికి రూ.50 వేలు(రూ.35 వేల విలువైన సామగ్రి, రూ.15 వేల చెక్కు), ఆదర్శ వివాహాలు చేసుకున్న రూ.2.5 లక్షల డిపాజిట్ పత్రాలను జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలకులు దళితులకు చేసిందేమీ లేదన్నారు.
సీఎం కేసీఆర్ మాత్రం దళిత బంధు అమలు చేసి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అందజేసే రుణాలపై మున్సిపాలిటీలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రుణాలు ఇవ్వడంలోఎస్సీ కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పెండింగ్‌లో ఉన్న రుణాలను అందజేయాలని సూచించారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికై సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తూ రూ.10 లక్షలు అందజేస్తున్నారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 100శాతం సబ్సిడీతో అందజేస్తున్న రుణాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ ప్రజా సంక్షమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను కోరారు. అసలు ఏ పథకాలు అమలు చేసిన కేంద్రం మాత్రం ప్రపంచం మొత్తం తెలిసేలా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. తీరా చూస్తే ఏ పథకం ఏ ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీతాశ్రీకాంత్ గౌడ్, కొండల్ రెడ్డి, అదనపు కలెక్టర్ జాం శ్యాంసన్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ప్రత్యేకాధికారి ఆనంద్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, ఎల్లుబాయి, జడ్పీటీసీలు శైలజారెడ్డి, అనిత, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.