కంటోన్మెంట్, ఆగస్టు 18: బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని జయానగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి హాజరై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక గౌడ కులానికే కాకుండా బడుగు, బలహీన వర్గాల విముక్తి కోసం పాపన్న ఎంతగానో కృషిచేశారన్నారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ నిరంతరం పోరాడే పటిమను అందిపుచ్చుకుని సర్దార్ అనే బిరుదుతో రాణించాడంటే, నేటి యువత ఆయన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వీరితో పాటు స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా, గౌడ సంఘం ప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులను గౌడ సంఘం ప్రతినిధులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, నివేదిత, గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు కళ్యాణ్ చక్రవర్తి గౌడ్, చైర్మన్ కృష్ణగౌడ్, ప్రభుకుమార్ గౌడ్, సంతోష్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, శ్యాంరావుగౌడ్, మారుతీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.