సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ)/ఆర్కేపురం/మన్సూరాబాద్: రాష్ట్రంలో 100కు ఫోన్ చేయగానే ఐదు నిమిషాల్లో పోలీసు సేవలు అందుతున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సరూర్‌నగర్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లో భరోసా కేంద్రం భవన నిర్మాణానికి ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీలు వాణీదేవి, బొగ్గారపు దయానంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. మహిళా భద్రతకు రాష్ట్ర పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ శాంతి భద్రతల పటిష్టత కోసం ఫ్రెండ్లీ పోలీసులను అందించేందుకు అవసరం ఉన్న అన్ని సదుపాయాలను అందిస్తున్నారన్నారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం భరోసా సెంటర్ పనిచేస్తున్నదన్నారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో నేరస్తులు నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితిని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల సీసీ కెమెరాలతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. భరోసా సెంటర్ ఏర్పాటుతో ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందన్నారు. అనంతరం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కొంత మంది ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి రాబోయే మూడు సంవత్సరాల్లో తమ నియోజకవర్గంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీని శాలువాతో సన్మానించి
నూతన షీటీమ్స్, ఈ చలాన్, ఐటీఎంఎస్ కార్యాలయం ప్రారంభం
ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షీటీమ్స్, ఈ చలాన్, ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్) కార్యాలయాలను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐటీఎంఎస్ పనితీరు, ఈ చలాన్, షీటీమ్స్ పనితీరుపై హోంమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ సుధీర్‌బాబు, డీసీపీలు సన్‌ప్రీత్ సింగ్, రక్షితమూర్తి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ సలీమ తదితరులు పాల్గొన్నారు.