హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో యువీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.2.5 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 120 ఐసీయూ బెడ్స్‌ను బుధవారం ప్రారంభించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, క్రికెటర్ యువరాజ్‌సింగ్, యువరాజ్ తల్లి షబ్నంసింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా దవాఖానలో యువీకెన్ ఫౌండేషన్ 120 అధునాతన ఐసీయూ బెడ్లను ఏర్పాటుచేయటం ఆనందంగా ఉందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి యువరాజ్‌సింగ్ గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత యువీకెన్ ఫౌండేషన్‌తో అనేకసార్లు చర్చలు జరిపి ఐసీయూ బెడ్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారని, ఆమె చొరవతోనే బెడ్స్ ఏర్పాటు చేశారని వివరించారు.