హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో GHMC, SNDP, టౌన్ ప్లానింగ్ ఇతర శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 61 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా నాలా పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి 45 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 12 వ తేదీన ఉదయం 9.00 గంటలకు మంత్రి కేటీఆర్ SP రోడ్ లోని ఖరాచి బేకరీ వద్ద పికెట్ నాలా పై 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పాటిగడ్డ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్ఫస్ పంక్షన్ హాల్ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి ప్రారంభిస్తారని తెలిపారు.
అదేవిధంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను ప్రకాష్ నగర్, అల్లంతోట బావి ప్రాంతాలలో ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బేగంపేట లోని నాలాకు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ, మాతాజీ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలు వరద నీటి ముంపుకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి వివరించారు.
ప్రధానంగా పలు మెయిన్ రోడ్లు అభివృద్ధి, నిర్మాణ పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని, పేద ప్రజలు నివసించే ఇంటర్నల్ రోడ్లు CC రోడ్లుగా నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రైల్వే శాఖ పెండింగ్ పనులపై KTR సమీక్ష..
సనత్ నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో GHMC, రైల్వే శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుపై బుద్ధ భవన్ లో జరిగే సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
సమావేశంలో GHMC ENC జియా ఉద్దిన్, టౌన్ ప్లానింగ్ CCP దేవేందర్‌రెడ్డి, SNDP CE వసంత, HRDCL సరోజిని, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ఎస్ఈలు అనిల్ రాజ్, రత్నాకర్, భాస్కర్ రెడ్డి, ఈఈ ఇందిర తదితరులు పాల్గొన్నారు.