Minister KTR | విశ్వనగరం తరహాలో అభివృద్ధి చెందిన హైదరాబాద్.. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌కు నచ్చుతుంది గానీ.. ఇక్కడ ఉన్న దరిద్రులకు నచ్చలేదని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జహీరానగర్ రోడ్‌షోకు ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూశారని, కేసీఆర్ హయాంలో రూ.1250 కోట్లతో మైనార్టీల సంక్షేమానికి కృషి చేశారన్నారు.
50 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు చేసిందేమి లేదని, దేశంలోని ఏ రాష్ట్ర సీఎం కూడా ఈ తరహాలో అభివృద్ధి చేయలేదన్నారు. 200కు పైగా మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
2014లో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షలు వేస్తానన్న మోదీ… ఆ మాటనే మరిచిపోయాడరన్నారు. విద్వేషపూరిత మాటలతో రెచ్చగొట్టే రాజాసింగ్‌పై సీఎం కేసీఆర్ పీడీ యాక్టుతో కోరలు పీకేశారన్నారు. షాదీ ముబారక్, పండుగ ఫూట తోఫాలను ఇచ్చి కేసీఆర్ ఆప్తుడిలా నిలిచారని కొనియాడారు.
జహీరానగర్, నంది నగర్లోనే నా ఓటు ఉందని, ఇక్కడకు నిత్యం వచ్చి పోతుంటానని ఇక్కడి సాధకబాధలపై అవగాహన ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు భయపడేది లేదని, మోదీ రానీ, బోడీ రాని ఎవరొచ్చినా భయపడేది లేదన్నారు.మోదీ వచ్చి కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీం అంటాడు. రాహుల్ వచ్చి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లలో ఏ ఒక్క రోజు కూడా అల్లర్లు, మత కల్లోలాలు లేవన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ మంచినీళ్లు వస్తున్నాయని, రానున్న రోజుల్లో 24గంటల పాటు మంచినీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమన్నారు.