
పాతనగర అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి కేటీఆర్
“తెలంగాణా కే చౌ తరఫ్ హరియాలీ హో..
హమారీ యే తమన్నా హై..
హమారీ యే ఖ్వాయిష్ హై..
చార్మినార్ కీ చౌ తరఫ్ ఖుషియాలీ హో!
అని సీఎం కేసీఆర్ గారు ఆకాంక్షించినట్టుగా.. తెలంగాణ హరితమ యం కావాలి. హైదరాబాద్ సుఖ సంతోషాలమయం కావాలి. పాత నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏడేండ్లలో 8 ప్రసూతి, 7 కమ్యూనిటీ, 50 పట్టణ ప్రాథమిక కేంద్రాలను బలోపేతం చేశాం. నగరం మొత్తంలో 350 బస్తీ వైద్యశాలను ఏర్పాటు చేస్తే అందులో పాత నగరంలో పెట్టినవి 109. దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తరహాలో మూసీ నదిపై 14 వంతెనలు రాబోతున్నాయి.
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాత నగరం అభివృద్ధికి రూ.3,934 కోట్లు నిధులు వెచ్చిస్తే.. మా ప్రభుత్వం నాలుగింతలు 14,887 కోట్లు ఇచ్చాం.” అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన సమాధానమిచ్చారు. పక్షపాతమన్నదే లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. నగరంలోని చెరువులను పరిరక్షించేందుకు స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
హయాత్ లేకే చలో..
కాయెనాత్ లేకే చలో ..
చలే తో సారే జమానే కో
సాథ్ లేకే చలో!
(బతుకుతో సాగుతూ నడుద్దాం.. లోకాన్ని వెంటబెట్టుకొనినడుద్దాం.. నడిస్తే.. మొత్తం కాలాన్ని వెంటబెట్టుకొని నడుద్దాం)
అని ప్రముఖ కవి మఖ్దూం మొహియుద్దీన్ చెప్పినట్టుగా… ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా హిందూ, ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా అందరినీ కలగలిపి ముందుకు తీసుకుపోతాం. మహాత్మాగాంధీ చెప్పినట్లు.. ఈ నగరం గంగా యమునా తెహజీబ్‌కు నిదర్శనం. వివక్ష లేకుండా హైదరాబాద్‌ను సుందరనగరంగా మార్చుతాం. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హైదరాబాద్ పాతనగరంలో అభివృద్ధి కనిపిస్తోందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాతనగర అభివృద్ధిపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. పాతనగరం అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించడం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తాను 25 ఏండ్లుగా సభలో ఉన్నా ఏనాడూ పాతనగరానికి సంబంధించి అసెంబ్లీలో చర్చజరగలేదని, అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
ఎమ్మెల్యే ఏ పార్టీ వారు అయినా సరే ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆలోచనతోనే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ పక్ష నాయకుడు భట్టివిక్రమార్క చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పాతనగరం, కొత్తనగరం అన్న వ్యత్యాసాలు లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాతనగరంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రోడ్లకు ఇతర నియోజకవర్గాల కంటే ఎక్కువే నిధులు ఖర్చు చేస్తున్నామని, ఇకపై బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు తగవని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.
కాంగ్రెస్ పార్టీ పదేండ్లలో పాత నగరం అభివృద్ధికి రూ.3934 కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేసిందని, టీఆర్ఎస్ సర్కార్ ఏడేండ్లలోనే రూ. 14887 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు నాలుగురెట్లు ఎక్కువ డబ్బులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు.
‘పాతనగరంలో 5.5 కి.మీ. మేర మెట్రోరైలు ప్రాజక్టును చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెండేళ్ల క్రితం మేము ఇదే అసెంబ్లీలో మేము హామీ ఇచ్చాము. కొవిడ్ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతున్నది. మెట్రో నష్టాల్లో ఉంది. దాన్ని కాపాడేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి దీనిపై ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నేనే కమిటీ చైర్మన్‌ను. త్వరలోనే కమిటీ సమావేశమై తగు నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
హైదరాబాద్ పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని నాంపల్లి నియోజకవర్గాన్ని కలుపుకుని పాత నగరంగా తీసుకుంటే పాతనగర అభివృద్ధికి ఖర్చుచేసిన నిధులను మంత్రి కేటీఆర్ సభకు గణాంకాలతో వివరించారు.
పాతనగరంపై రాష్ట్ర ప్రభుత్వానికి వివక్ష లేదని, వారు ఊహించినదానికంటే ఎక్కువ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నామని, ఇందులో 3 దాదాపు పూర్తయ్యాయని, ఇందుకు రూ.19.30 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వరంలో హైవేల కోసం రూ.33.56 కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.50 కోట్లతో బండ్లగూడ, కాటేదాన్, కిల్వత్, శాస్త్రిపురం దగ్గర స్టేడియాలు నిర్మిస్తున్నామని అన్నారు. కిల్వత్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. పాతబస్తీలో 38,499 మంది వీధి విక్రయదారులను గుర్తించి, 38,170 మందికి కార్డులు ఇచ్చి రూ.10వేల చొప్పున లోన్ మంజూరు చేశామన్నారు.
హైదరాబాద్‌లో 150 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఉంటే పాతబస్తీలోనే 48 ఉన్నాయని, 2 కోట్ల మందికి భోజనం పెట్టామని అన్నారు. ఉస్మానియా, నిలోఫర్, మహావీర్, నాంపల్లి ఏరియా దవాఖానల్లో రూ.13 కోట్లతో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు.
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో మరికొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉన్నది. ఇన్నర్ రింగ్‌రోడ్, ప్రత్యామ్నాయ రోడ్లు వేస్తాం. దీంతోపాటు లాడ్‌బజార్, పత్తర్ ఘట్టీ, సర్దార్ మహల్‌ను కూడా అభివృద్ధి చేసి టూరిజం స్పాట్‌గా చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు మీద మరో రూ.100-150 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చార్మినార్, మక్కామసీద్, మదీనా, చౌమహల్లా వంటి వారసత్వ, పర్యాటక ప్రాంతాలు 24 గంటలు శుభ్రంగా ఉండేలా ప్రత్యేకంగా శానిటేషన్ ప్రణాళిక చేపట్టాం.
తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే హాకర్స్, స్ట్రీట్ వెండర్స్‌ను కాపాడేలా మూసీనదిపై ప్రత్యేకంగా 14 కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. దుర్గం చెరువుకు కేబుల్ బ్రిడ్జితో ఎలాగైతే కొత్త అందం వచ్చిందో అదే పద్ధతిలో మూసీపై నిర్మించబోయే 14 బ్రిడ్జిలను పాతనగర వైభవాన్ని చాటిచెప్పేలా నిర్మిస్తామన్నారు.
చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్
రేపు నగర ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం
జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించనున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర సమస్యలపై చర్చించడానికి నగర ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యేలు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్, సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. నగరంలోని 185 చెరువుల్లో 127చెరువులను అభివృద్ధి చేయడానికి గుర్తించామన్నారు. ఇందులో ఇప్పటికే 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. మొత్తం రూ.407కోట్లలో ఇప్పటి వరకు రూ.218 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
మిషన్ కాకతీయ కింద రూ.282.63కోట్ల అంచనా వ్యయంతో 19 చెరువుల పునరుద్ధరణను జీహెచ్ఎంసీ చేపట్టిందన్నారు. చెరువుల పరిరక్షణకు త్రిపుల్ ఆర్ మంత్రను వినియోగిస్తామన్నారు. రిమూవ్, రిహాబిటేషన్, రిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. నాలాల మీద కబ్జా చేసి నిర్మాణాలు చేసుకున్న వారిని తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇప్పుడు నిర్మించిన ఇండ్లలో 25వేల పక్కకు పెట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు. ఇదిలా ఉంటే చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్‌ను నియమిస్తూ పురపాలక శాఖ సోమవారమే ఉత్తర్వులు జారీ చేయటం విశేషం.
సభ్యులు కోరిన విధంగా కాలేజీలు, స్కూళ్ల విషయంలో సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. బహదూర్‌పుర, ఫలక్‌నుమాలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కూడా మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. డిగ్రీ కాలేజీకి భవనం ఇస్తామని అక్బరుద్దీన్ ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకొని డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్ తదితర అంశాలను కూడా మంత్రి దృష్టికి తెస్తాము.
200ఏళ్లనాటి మీరాలం మండీ అభివృద్ధికి ఇప్పటికే రూ. 10కోట్లు కేటాయించాం. దాని ఆర్కిటెక్చరల్, సహజత్వం కోల్పోకుండా పునరిద్ధంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీరాలం ట్యాంక్‌ను కూడా దుర్గం చెరువు మాదిరిగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనికి రూ. 40కోట్లపై చిలుకు ఖర్చుతో పనులు చేపట్టే ప్రతిపాదన ఉంది. డ్యాన్సింగ్ లైటింగ్ ఫౌంటెన్‌ను కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి బెంగుళూరు హైవేనుంచి కనెక్టివిటీ ఉంది. త్వరలో పనులు చేపడతాం.
హైదరాబాద్‌లో 31 ఎస్టీపీలకుగానూ 14 పాతబస్తీలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలకు సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్‌ప్లాన్ కోసం రూ.297 కోట్లు మంజూరు చేశాం. చాంద్రాయణగుట్ట మాస్టర్ ప్లాన్ పూర్తిచేసి నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తాం. మొత్తంగా మూసీకి దక్షిణం వైపు రూ.1,355 కోట్లతో, ఉత్తరంవైపు రూ.615 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి మూసీ ప్రక్షాళనకు సహకరిస్తాయని అన్నారు. 716 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉండగా, 500 ఆటోలు ఈ నెలాఖరు వరకు వస్తాయి.
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మైనార్టీల సంక్షేమం, పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ చరిత్రలో అక్టోబర్ 4 హైదరాబాద్‌కు చరిత్రాత్మక రోజని చెప్పారు. తన 20 ఏండ్ల రాజకీయ (ఎమ్మెల్యేగా) జీవితంలో మొట్టమొదటిసారిగా పాత నగరం అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాతనగరానికి మెట్రో రైల్‌ను విస్తరించాలని కోరారు. రోడ్ల విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో 400 మంది చనిపోతే వారికి ప్రత్యేక ఖబరస్తాన్ కావాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి ఫకీర్ ఉల్ దర్గా సమీపంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) మొదటి దశ రూ.855 కోట్లతో చేపడుతున్నామని, ఇందులో రూ.261 కోట్లు పాతబస్తీకి కేటాయించామన్నారు. టెండర్లు పూర్తయ్యాయని, వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభం అవుతాయన్నారు. గతంలో చేసిన రూ.185 కోట్ల పనులకు తోడు వీటిని కలిపితే మొత్తం రూ.447 కోట్లు కేటాయించామన్నారు.
రూ. 17కోట్లతో మోజంజాహీ మార్కెట్‌ను టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మార్చాం. సెవెన్ టూంబ్స్కు కూడా ప్రపంచ వారసత్వ హోదా లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం హైదరాబాద్‌కు వరల్డ్ హెరిటేజ్ హోదా వస్తే బావుంటుంది. చార్మినార్‌తోపాటు ఇతర వాటిని కూడా తెచ్చేందుకు కృషి చేస్తాం. లాడ్‌బజార్ రీడెవలప్మెంట్ గురించి అర్కిటెక్చర్‌ను నియమించాం. ప్రస్తుతం వారు నమూనాలు రూపొందిస్తున్నారు. అలాగే, సర్దార్ మహల్ ప్లాన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. సభ్యులు కోరినట్లు చంచల్‌గూడలో ఐటీ ఇండస్ట్రియల్ పార్కు తెచ్చేందుకు కృషి చేస్తాము.
గతంలో పాత నగరంలో రోడ్ల అభివృద్ధికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవని, టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏడు వివిధ ప్రాజెక్టులను తీసుకుని రూ.1545 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఓవైసీ దవాఖాన జంక్షన్ వద్ద రూ.94కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను డిసెంబర్లో పూర్తి చేస్తామని తెలిపారు.
బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ను రూ.106 కోట్లతో నిర్మిస్తున్నామని, రూ.42కోట్లతో చాంద్రాయణగుట్ట దగ్గర కూడా మరో ఫ్లైఓవర్, నల్లగొండ క్రాస్‌రోడ్డు నుంచి ఓవైసీ దవాఖాన వరకు రూ.523 కోట్లతో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నట్టు తెలిపారు.
ఫలక్‌నుమా దగ్గర ఆర్వోబీ రూ.52 కోట్లతో, శాస్త్రిపురం దగ్గర మరో ఆర్వోబీ రూ.91 కోట్లతో, ఆరాంగఢ్ నుంచి జూపార్క్ వరకు రూ. 637 కోట్లతో మరో ఆర్వోబీ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఇందులో రూ.452 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఎస్ఆర్డీపీ ఫేజ్-2పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఆరాంగఢ్ వద్ద రూ.90 కోట్లతో మరో రెండు ఆర్వోబీలు నిర్మించాలని, ఫలక్‌నుమా నుంచి బుద్వేల్ లైన్ రూ.125కోట్లతో మరో ఆర్వోబీ నిర్మించాల్సి ఉందని, బెంగళూరు హైవే నుంచి శాస్త్రిపురం వరకు రోడ్డు విస్తరణకు రూ. 223 కోట్లు ఖర్చు అవుతుందని, ఇలా మొత్తంగా రూ. 612 కోట్ల పనులకు తమవద్ద ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిపారు.
ఎస్ఆర్డీపీ ఒక్కటే కాకుండా ఉన్న రహదారులను కాపాడాలన్న ఉద్దేశంతో నగరంలోని 729 కిలోమీటర్ల మెయిన్ రోడ్డులను కాంప్రిహెన్సివ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కింద తీసుకుని రూ.1839 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో పాతనగరంలో 154 కిలోమీటర్ల రోడ్లు తీసుకుంటే ఇందుకోసం 113 కిలోమీటర్ల రోడ్లకు ఫుట్‌పాత్‌ల విస్తరణ, ఇతర పనులు చేస్తున్నామని, ఇందుకోసం రూ.118 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే మరోసంస్థను ఏర్పాటు చేసి పాతనగరంలోని 68.52 కి.మీ. మేర రోడ్లను తీసుకుని రూ. 60కోట్లతో మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత రోడ్ల విస్తరణ కోసం భూ సేకరణ నిమిత్తం రూ.327కోట్ల 65 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా రూ.166 కోట్ల 36 లక్షలు ఖర్చుచేయబోతున్నట్టు వెల్లడించారు.
అదనపు ఖర్చు అయినా సరే..చార్మినార్ సుందరీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్‌ను బాగా చేస్తే ప్రపంచాన్ని ఆకర్శించవచ్చన్నారు. అందుకే అమృత్సర్ పాదచారుల ప్రాజెక్టు తరహాలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే అత్యుత్తమ విధానాలు అనుసరించిన అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, ఢిల్లీలోని చాందినీచౌక్‌ను పరిశీలనకు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, ఇతర అధికారుల నేతృత్వంలో ఒక బృందాన్ని పంపించినట్టు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు పాదచారుల ప్రాజెక్టుల కోసం రూ.33 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న లాడ్‌బజార్, పత్తర్‌గట్టీ, సర్దార్ మహల్ రెస్టోరేషన్, ముర్గీచౌక్ డెవలప్మెంట్, మీరాలం ట్యాంక్ డెవలప్మెంట్ తదితర పనులు వెంటనే చేపడతాం. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించి ఒక అధికారిని కూడా నియమించి కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని బలోపేతం చేస్తాం.
ఉస్మానియా దవాఖానకి మంచి భవనం నిర్మించడంతోపాటు చక్కటి వైద్య అందించే విషయం కూడా సీఎం దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. ఏడేండ్లలో పాత నగరంలో 8 ప్రసూతి దవాఖానలు, మూడు ఏరియా దవాఖానలు, ఏడు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 50పట్టణ ప్రాథమిక కేంద్రాలను బలోపేతం చేశాం. కొత్తగా 84బస్తీ దవాఖానాలను ఓల్డ్‌సిటీలో ఏర్పాటు చేశాము. జూన్ 2017నుంచి ఇప్పటివరకు, అంటే కేసీఆర్ కిట్ కార్యక్రమం వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో 2,45,773 ప్రసవాలు జరిగాయి.
1.60 లక్షల మంది పైచిలుకు లబ్ధిదారులకు రూ. 88కోట్ల వ్యయంతో కిట్లు అందించాం. నగరంలో మొత్తం 350బస్తీ దవాఖానాలు పెట్టాలని లక్ష్యం కాగా, 109ఓల్డ్‌సిటీలో పెట్టాం. రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో 14, అక్బరుద్దీన్ నియోజకవర్గమైన చాంద్రాయణగుట్టలో 15 పెట్టాం. మాకు ఎక్కడా బీజేపీ, ఎంఐఎం అనే తేడా లేదు.
మహాత్మాగాంధీ అన్నట్లు ఇది గంగా యమునా తెహజీబ్‌కు నిదర్శనం. లాల్‌దర్వాజ మహంకాళి టెంపుల్ విస్తరణకు సీఎంతో ఇప్పటికే చర్చించాం. స్పందించిన సీఎం రూ. 10 కోట్లు కూడా మంజూరు చేశారు. ఇక్కడ ఐదు స్థలాలు సేకరించాల్సి ఉంది. ఒకరు ఒప్పుకోగా, మరో నలుగురు ఒప్పుకోవాల్సి వుంది. అలాగే, అప్జల్‌గంజ్ మసీదు అభివృద్ధికి కూడా రూ. 3 కోట్లు కేటాయించాం. శివాజీ నగర్ దేవాలయం వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తక్షణమే అనుమతులు ఇస్తాం. సచివాలయంలో మూడు ప్రార్థనా మందిరాలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. త్వరలోనే ఒకే రోజు మూడు నిర్మాణాల పనులు ప్రారంభిస్తాం.
మహబూబ్‌నగర్‌లోని జేపీ దర్గా ఐటీఐ యాజమాన్యం దరఖాస్తు చేసుకొంటే షాద్‌నగర్‌కు మార్చేందుకు అనుమతిస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 4 : నగరంలో తాగునీరు, మురుగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ రూ.5 వేల కోట్లు మంజూరు చేసినందుకు నగరంలోని ఎమ్మెల్యేల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కాలువల పొడవు, వెడల్పులపై రెవెన్యూ అధికారుల వద్ద స్పష్టత లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు.
నాలాల పొడవు, వెడల్పుల లెక్కలను పక్కాగా తేల్చి వాటి విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గానికి మంజూరైన ఎస్టీపీ కేంద్రాలు చెరువు శిఖంలో ఏర్పాటు చేస్తారా..? ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాటు చేస్తారా..? బఫర్ జోన్లో ఏర్పాటు చేస్తారా..? స్పష్టత ఇవ్వాలని కోరారు. చెరువుల్లో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములు కూడా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం సేకరించి రైతులకు నష్టపరిహారంగా టీడీఆర్ చెల్లించాలని కోరారు.
సికింద్రాబాద్, అక్టోబర్ 4: కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. నగరం నడిబొడ్డున ఉన్నా, రక్షణ శాఖ ఆధీనంలో కంటోన్మెంట్ ప్రాంతం ఉండడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభించడం లేదన్నారు.
1999లోనే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని, ప్రస్తుతం మరోసారి ప్రజల నుంచి విలీనం చేయాలనే వినతులు వస్తున్నాయని చెప్పారు.ఇక్కడి ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, జీహెచ్ఎంసీలో విలీనం అయ్యేలా చూడాలని కోరారు.
ఖైరతాబాద్, అక్టోబర్ 4 : ఖైరతాబాద్ మహాగణపతి ఎదురుగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో దవాఖాన అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఖైరతాబాద్, రాజ్‌భవన్, పరిసర బస్తీలకు చెందిన సుమారు లక్షన్నర మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో 50 పడకల దవాఖానను నిర్మించామన్నారు. ప్రస్తుతం అందులో వెల్నెస్ సెంటర్ నడుస్తున్నదని, అన్ని హంగులతో నిర్మించిన దవాఖానను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.