సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచి, వాటిని పరిరక్షించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఒక స్పెషల్ కమిషనర్‌ను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో మంత్రి కె. తారకరామారావు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ, పరిరక్షణ కార్యక్రమాలపై సోమవారం సమీక్షించారు. చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, పరిరక్షణకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపిన మంత్రి కేటీఆర్, ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ను నియమించడం ద్వారా ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని 185 చెరువులు, ఇతర జలవనరులు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్‌కు అప్పగిస్తామని తెలిపారు.
చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు అత్యంత కీలకమైన నాలాలు అభివృద్ధి, తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలా అభివృద్ధికి సంబంధించి ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. వీటితో పాటు ఎస్ఆర్డీపీ, లింకు రోడ్ల విస్తరణ, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, హెచ్ఆర్డీసీఎల్ వంటి సంస్థలు చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
సీవరేజీ మేనేజ్‌మెంట్‌తోపాటు మురుగునీటి శుద్ధి కార్యక్రమాలు, శుద్ధి చేసిన నీటిని మళ్లించడం, చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, సాగునీటి వనరుల పరిరక్షణ, చెరువుల సుందరీకరణ, చెరువు కట్టల బలోపేతం, చెరువుల పైన గ్రీన్ కవర్ పెంచడం వంటి పలు బాధ్యతలను ఈ స్పెషల్ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో పని చేస్తుందని, సాగునీటి శాఖ ,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇతర అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకొని స్పెషన్ కమిషనర్ పనిచేయాల్సి ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ కమిషనర్ కింద పనిచేస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు సుందరమైన, కాలుష్య రహిత జల వనరులను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రత్యేక కమిషనర్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ప్రయత్నం మరింత వేగవంతమవుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.