సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 30 : మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో తనకు అడ్మిషన్ దొరకడంతోనే రాజకీయాల్లోకి అడుగుపడిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పాలిటెక్నిక్ కళాశాలలో డైమండ్ జూబ్లీ స్మార స్తూపం (పైలాన్) నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, పూర్వ విద్యార్థులతో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12, 13వ తేదీల్లో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొదటి అడుగుగా పైలాన్ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కళాశాలలో తనకు అడ్మిషన్ లభించడంతోనే రాజకీయాల్లోకి అడుగుపడిందని తెలిపారు. తన దగ్గరే ఉండి విద్యను అభ్యసించాలని నాడు సీఎం కేసీఆర్ చెప్పడం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండి విద్యను అభ్యసించానని, అదే సమయంలో తన రాజకీయ జీవనం ప్రారంభమైందని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నందున నిధుల కొరత లేదని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ బాధ్యతగా తలా ఓ చేయి వేసి కళాశాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఇందుకు గాను తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా ముందుగానే ఆహ్వానించాలని కోరారు. అందుకు గాను ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు.