
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పట్ల తెలంగాణ ప్రభుత్వం గొప్ప అభిమానాన్ని చాటుకుంది. నగరంలో ఓవైసీ – మిధాని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌కు అబ్దుల్ కలాం పేరును నాకమరణం చేస్తూ.. ఘనంగా నివాళులర్పించింది.
అయితే ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును నామకరణం చేస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. డీఆర్డీవోలో పని చేసిన గొప్ప మనిషి అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఓ దశాబ్ద కాలం పాటు అబ్దుల్ కలాం నివాసమున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న కలాంకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఇక ఓవైసీ – మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్‌ను ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొంటూ.. వీడియోను షేర్ చేశారు.
ఫ్లై ఓవర్ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
A short video on the just inaugurated Owaisi-Midhai Junction flyover built under #SRDP by #GHMC
— KTR (@KTRTRS) December 28, 2021
We have decided to name it after Hon’ble former president APJ Abdul Kalam Ji 🙏
Small tribute a great man who worked at DRDO & also lived in the neighbourhood for over a decade pic.twitter.com/XgS5f6wUXo
నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా ఈ ఫ్లైవర్ను నిర్మించారు. ఓల్డ్ సిటీ నుంచి ఎల్బీనగర్ వైపునకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. మిధాని -డీఎంఆర్ఎల్ కూడళ్ల మధ్య వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఎస్ఆర్డీపీ పథకం కింద రూ. 63 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లైవర్ మొత్తం పొడవు 1.36 కిలోమీటర్లు కాగా, 12 మీటర్ల వెడల్పుల్లో 3 వరుసలుగా నిర్మించారు.