ఖైరతాబాద్, ఆగస్టు 6 : మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ను ముట్టడించారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో వందలాది మంది కార్మికులు ఒక్కసారిగా దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి.
సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. స్వప్న, ఎస్. రమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 54,202 మంది కార్మికులు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండిపెడుతున్నారని, ప్రభుత్వం గత పది నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ పిల్లల ఆకలి తీరుస్తున్నామన్నారు. ఐదు నెలలుగా తమకు వేతనాలు లేవని, పది నెలల కోడిగుడ్లు, వంట బిల్లులు పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్‌తో రెండు కోడిగుడ్లు కూడా రావని, పైగా పిల్లలకు మూడు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు, స్కూల్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఓ వైపు బిల్లు రాక, వేతనాలు చెల్లించక తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10వేల వేతనం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు మ్యానిఫెస్టోలో సైతం పొందుపర్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా కోసం వివిధ జిల్లాల నుంచి రైళ్లలో బయలుదేరారని, ఈ క్రమంలో రైళ్లలోకి వెళ్లి మరీ అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చర్యలు ప్రజాపాలనలా లేదని, నిర్బంధ పాలనను తలపిస్తుందన్నారు. తమ వేతనాలు, బిల్లులన్నింటీ యూ కుబేర్ కు అనుసంధానం చేయడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులను నిరసిస్తూ నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి సభ్యులు కృష్ణమాచారి, సులోచన, సత్యనారాయణ, రాజేశ్వరి పాల్గొన్నారు.