Hyderabad Metro | సిటీబ్యూరో, మే 16 ( నమస్తే తెలంగాణ ) : నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మెట్రో అధికారులు వ్యవహరిస్తున్నారు. నష్టాల సాకు చూపి టికెట్ ధరలు పెంచేశారు. కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ ప్రకటించింది. శనివారం నుంచి ఈ ధరలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సౌకర్యాల మాటేమిటీ అని ప్రయాణికులు అధికారులను నిలదీస్తున్నారు. సాంకేతిక సమస్యలతో మెట్రో రైలు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియడం లేదని.. అరగంటపైగా రైలు నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో స్టేషన్లకు సులభంగా చేరుకునేలా ప్రత్యేకంగా ఎలాంటి రవాణా కనెక్టివిటీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ప్రయాణికులతో ప్రతి రోజు మెట్రో రైలు రద్దీని తలపిస్తుంది. అదనపు బోగీలు పెంచాల్సింది పోయి.. టికెట్ ధరలు పెంచడంపై మెట్రో అధికారులు దృష్టి సారించడం ఏంటని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. అదనపు బోగీలు పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోకుండా టికెట్ ధరలు పెంచి అధికారులు చేతులు దులిపేసుకున్నారు.
ప్రయాణికుడి జేబు చిల్లు..!
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రాయితీలు 10 శాతం, 5 శాతం రాయితీ ఉండేది. కానీ ఇప్పుడు కార్డులన్నిటిని రద్దు చేశారు. మెట్రో హాలిడే కార్డు అంటే రూ.50 తో రీచార్జ్ చేసుకుంటే ఒక్క రోజంతా ప్రయాణం చేసే సౌకర్యాన్ని సైతం రద్దు చేశారు. ఎటొచ్చి ప్రయణికుడు ఇప్పుడు మెట్రోలో ప్రయాణించాలంటే జేబుకు చిల్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. రూ. 10 ఉంటే టికెట్ రూ.12 అయింది. రూ.65 టికెట్ 75 అయింది.
కేసీఆర్ పాలనలో పెరగని చార్జీలు
కరోనా సమయంలో మెట్రో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ సమయంలోనూ అధికారులు టికెట్ ధరలు పెంచడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ టికెట్ల పెంపునకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. సెప్టెంబర్ 5, 2022లో ఎఫ్ఎఫ్సీ కమిటీ నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన హైదరాబాద్ ప్రజా అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ హయాంలో ఎప్పుడూ టికెట్ ధరలు
పెరగలేదు.
పార్కింగ్ దందా..
మెట్రో ప్రయాణం చేయాలంటే టికెట్ ధరలతో పాటు పార్కింగ్ ధరలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనానికి రోజుకు రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. నెలకు రూ. 12 వందల నుంచి రెండు వేల వరకు చార్జీ అవుతుందని మెట్రో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఐటీ ఉద్యోగి ఈ చివర నుంచి ఆ చివరకు వెళ్లాలంటే నెలకు టికెట్ ధరలు రూ.75 చొప్పున రోజుకు 150 అవుతుంది. 20 రోజులకు రూ.3వేల వరకు ప్రయాణికుడికి చిల్లు పడుతున్నది.
దీంతో పాటు అదనంగా పార్కింగ్‌కు రూ.2వేలు. మళ్లీ స్టేషన్ చేరాక అక్కడి నుంచి ఆఫీస్‌కు చేరుకోవడానికి బుకింగ్ బైక్, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆ ధరలు అదనంగా పడుతున్నాయి టాయిలెట్‌కు డబ్బులు ..మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ వినియోగించుకోవాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. సాధారణంగా ప్రయాణికుల స్టేషన్లకు టాయిలెట్స్ ఉచితంగా ఉంటాయి. కానీ మెట్రో స్టేషన్లలో మాత్రం టాయిలెట్ వినియోగించుకోవాలంటే రూ.5 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. రూ.2 వసూలు చేయాల్సింది.. రూ.5 తీసుకుంటున్నారని తెలిపారు. ప్రయాణికులకు కావాల్సిన వసతులు మెట్రో అధికారులు కల్పించలేదు. కానీ టికెట్ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి మెట్రో సిద్ధమైందని వాపోతున్నారు.