Hyderabad Metro | సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : మహానగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉండే సిటీ జనాలను.. బోగీల్లో కుక్కి ఉక్కిరిబిక్కిరి చేసింది. నిమిషమో, రెండు నిమిషాలు ఆగిపోయిందంటే పొరపాటే. ఏకంగా 15 నిమిషాలు ఎటు కదలకుండా ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. ట్రైన్ దిగి మెట్రో స్టేషన్లకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురి కాగా, నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే సమయం కావడంతో నాగోల్ – రాయదుర్గం, ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో పలు సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రైళ్లు ఆగినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్-రాయదుర్గం, ఎల్బీ నగర్- మియాపూర్ మార్గాల్లో పరుగులు తీసే మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సవరించడంతో అప్పటికే తీవ్ర ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
మూసుకోని గేట్లు..
నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రైన్… బేగంపేట్ మెట్రో స్టేషన్కు రాగానే నిలిచిపోయింది. ట్రైన్ డోర్లు మూసుకుపోలేదు. దీంతో ట్రైన్ ముందుకు కదలకుండా ఆగింది. ఈ కారణంగా అమీర్పేట్ ఇంటర్ చేంజ్తోపాటు ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో వచ్చిపోయే సర్వీసులకు కూడా ఇబ్బంది కలిగింది. దీంతో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద గంటల కొద్దీ ప్రయాణికులు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రధాన ఇంటర్చేంజ్లైన ఎంజీబీఎస్, అమీర్పేట్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అయితే ఉన్నపళంగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
సాంకేతిక లోపమే కారణం : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
దాదాపు 15నిమిషాల పాటు మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రైళ్ల ఫ్రీక్వెన్సీని పునరుద్ధరించామని వివరించారు. సాంకేతిక సమస్యల వల్ల నాగోల్-రాయదుర్గం మార్గంలో బేగంపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో నిలిచిపోయిందని, దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో సేవలకు అంతరాయం కలిగింద్నరు. బేగంపేట్ వద్ద ఈ సమస్య రావడంతో.. అమీర్పేట్, మియాపూర్, నాగోల్ రూట్లో మెట్రో రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. మెట్రో రైళ్లను రీస్టోర్ చేయడంతోనే సేవలు యథావిధిగా ప్రారంభమైనట్లు స్పష్టం చేశారు.
ఉచిత పార్కింగ్ కొనసాగించాలని మెట్రో ప్రయాణికుల ధర్నా
ఉప్పల్, నవంబర్ 4 : నాగోల్లో మెట్రో రైల్ స్టేషన్ ఆవరణలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని కోరుతూ సోమవారం మెట్రో ప్రయాణికులు ధర్నా నిర్వహించారు. కనీస వసతులు కల్పించాలని, ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పించే బాధ్యత మెట్రో సంస్థదేనని తెలిపారు. ప్రభుత్వ భూమిలో వాహనాలను నిలిపితే డబ్బులు వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించిన వాహనాలకు రక్షణలేదని వాపోయారు. రద్దీకి తగిన విధంగా సౌకర్యాలు కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.