Hyderabad Metro | మహానగరంలో మెట్రో రైలు ఏ మార్గాల్లో అవసరమో అధికారులకు బాగా తెలిసే ఉంటుంది. అయినా వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు.. ప్రాజెక్టు ఆమోదయోగ్యమైనా.. అనే విషయాలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఎందుకంటే మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలపై నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ సర్కారు ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంలో ప్రయాణికులు ఎవరైనా హైటెక్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే మూడు చోట్ల మెట్రో స్టేషన్లను మారాల్సి ఉంటుంది. పైగా ఉత్తర హైదరాబాద్‌ను విస్మరించడమే కాకుండా.. జనమే లేని ఫోర్త్ సిటీకి ఒకేసారి 40 కి.మీ మార్గాన్ని ప్రతిపాదించడం ఆయోదయోగ్యం కాదంటున్నారు. ఈ విషయంలో పాలకులు ఏదీ చెబితే అది..తల ఊపకుండా.. సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాల్సిన అధికారులు మౌనం వహించడాన్ని తప్పుపడుతున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టు అంటూ రకరకాల మెట్రో మార్గాలను ప్రతిపాదించింది. అలా సుమారు 8 నెలలు గడిచినా ఇంకా మెట్రో రూట్ల ప్రతిపాదన దగ్గరే అగిపోయింది తప్ప.. అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రతిపాదనలు మార్చి ఇదే తుది రెండో దశ అంటూ ప్రకటించిన మెట్రో కారిడార్లపైనా నగర వాసులు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 10 నెలలు గడిచింది. పనులు పురోగతిలో ఉన్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్ ప్రాజెక్టును రద్దు చేయడమే కాకుండా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో కారిడార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఇప్పుడదే… ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. దీనికి తోడు ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు మెట్రో మార్గాలను అసలు పరిగణలోకే తీసుకోలేదు. దీంతో ఆ ప్రాంత వాసులంతా మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వేలాది మంది ఒక్కటై ఉత్తర తెలంగాణకు మెట్రో మార్గాలను రెండో దశలోనే చేపట్టాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పది నెలలుగా కాంగ్రెస్ సర్కారు రెండో దశ మెట్రో ప్రతిపాదనలను అడ్డదిడ్డంగా మార్చడానికి పరిమితమైంది తప్ప.. అంతకు మించి చేసిందేమీ లేదంటూ నగర వాసులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండోదశ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలను కాలాయాపన చేస్తూ కన్సల్టెన్సీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 4-5 నెలల్లో పూర్తి కావాల్సిన డీపీఆర్‌లు 8 నెలలు గడిచినా పూర్తి కాకపోగా, కొత్తగా మరిన్ని మార్గాలను చేరుస్తూ.. కాలయాపన జరిగేలా చేస్తోందే తప్ప.. క్షేత్ర స్థాయిలో మెట్రో ప్రాజెక్టు పనులు మాత్రం జరగడం లేదు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కన్సల్టెన్సీలకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కట్టబెడుతుందే తప్ప.. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉన్న మెట్రో కారిడార్లను నిర్ణయించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నగరంలో చాలా చోట్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో నగర వాసులు నిత్యం సతమతమవుతున్నారు. అత్యంత రద్దీతో కూడిన మార్గాల్లో మెట్రో కారిడార్లను నిర్మించాల్సి ఉన్నా, 8 నెలలుగా ప్రతిపాదనల మార్పులు, చేర్పులకే పరిమితమైందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహానగరంలో కొత్తగా నిర్మించాల్సిన మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో అత్యవసరమైన మార్గాలను ఎంపిక చేసుకొని వాటికి డీపీఆర్‌లను రూపొందించి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు సూచిస్తున్నారు.