KP Vivekanand | సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘సాధిద్దాం… సాధిద్దాం.. మేడ్చల్ మెట్రో సాధిద్దాం… కావాలి… కావాలి.. మేడ్చల్‌కు మెట్రో కావాలి… వీ డిమాండ్… మేడ్చల్ మెట్రో… నార్త్ హైదరాబాద్‌కు మెట్రో కావాలి’… అంటూ.. ఉత్తర హైదరాబాద్ వాసులంతా ఒక్కటై నినదించారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ఉత్తర హైదరాబాద్ ప్రాంత వాసులంతా ఒక్కటై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొన్ని నెలలుగా మెట్రో కోసం డిమాండ్ చేస్తున్నా..రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆందోళనలకు వేలాది మంది మద్దతు పలికారు. ప్రజాప్రతినిధులు సైతం వారికి అండగా నిలిచి.. మేడ్చల్ మెట్రో సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆదివారం జీడిమెట్ల విలేజ్ గాంధీ విగ్రహం వద్ద మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా మెట్రో విస్తరణ, ఫ్ల్లైఓవర్లు అండర్ పాస్‌ల నిర్మాణాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నగరానికి ఉత్తరం వైపున కొంపల్లి, మేడ్చల్, తూంకుంట, శామీర్‌పేట ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిరోజులకే పక్కన పెట్టిందన్నారు.
ఫోర్త్‌సిటీ పేరుతో రూ.8 వేల కోట్లను ప్రతిపాదించి.. సీఎం రేవంత్‌రెడ్డి ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. చెరువుల పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చుతూ..ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి నిధుల కేటాయింపు వంటి నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నిర్ణయాల వెనుక సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యం, అవగాహన లేమి ప్రజలకు స్పష్టంగా అర్థ్ధమవుతున్నదన్నారు. ఇక్కడి ప్రాంతానికి న్యాయబద్ధంగా రావాల్సిన మెట్రోను సాధించేంత వరకు ఉద్యమాలు ఆపేదిలేదని హెచ్చరించారు.
‘హైదరాబాద్ ఉత్తర భాగమైన మేడ్చల్, కొంపల్లి, అల్వాల్, శామీర్‌పేట, కీసర ప్రాంతాలు అన్ని రంగాల్లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు లోపల, బయట ప్రాంతాల్లోనూ నివాసాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలున్నాయి. దీంతో నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతాలకు మెట్రో మార్గాలను నిర్మించాల్సిన అవసరం ఉంది’. అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ధర్నాలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ ప్రాంతం వరకు మెట్రో రావాలని గత కొన్ని నెలలుగా ఇక్కడి నివాసితులు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారందరికీ అండగా ఉంటుంది. రేవంత్ సర్కారు మంచి చేసేందుకు సమయం ఇచ్చాం. కానీ అన్ని తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నది. అందుకు నిదర్శనమే… మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలకు మెట్రో మార్గాలను విస్తరించకపోవడం. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతాలకు మెట్రో మార్గాలను ప్రతిపాదించినా.. దాన్ని రేవంత్ సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసింది. మేడ్చల్ మెట్రో సాధనకు పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం.
అసెంబ్లీలో సైతం ఈ అంశాన్ని లేవనెత్తాం.దీనికి సరైన సమాధానం సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అన్ని వేదికలపై మేడ్చల్ మెట్రో అంశాన్ని ప్రస్తావిస్తాం. మేడ్చల్ మెట్రో మార్గం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం కండ్లు తెరిచే వరకు ఈ పోరాటం ఉంటుంది. మేడ్చల్ మెట్రో సాధన సమితి 8 నెలలుగా నిర్విరామంగా పోరాడుతున్నది. అయినా రేవంత్ సర్కారు పట్టించుకోకుండా రెండో దశ మెట్రో ప్రతిపాదిత మార్గాలను ప్రకటించింది. అందులో ఎక్కడా మేడ్చల్, శామీర్‌పేట వైపు మెట్రో మార్గాలను నిర్మిస్తామని చెప్పలేదు.
– కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే