సౌకర్యవంతమైన ప్రయాణం.. కాలుష్యరహితం.. రణగొణ శబ్దాలు వినబడవు.. సాఫీగా.. దర్జాగా త్వరగా.. గమ్యస్థానాలకు.. ఇదీ మెట్రోపై నగరవాసులకు ఉన్న సదాభిప్రాయం. కానీ నేడు ఆ ప్రతిష్ఠ మసకబారుతున్నది.. మెట్రో ప్రయాణమంటే.. హడలిపోతున్నారు..ఎప్పుడు ఆగిపోతుందో.. ఎక్కడ ఆగిపోతుందోనన్న భయం ప్రయాణికులను వేధిస్తున్నది.. ‘ఏసీ’ బోగీల్లోనూ చెమటలు పట్టేలా చేస్తున్నది.
తరచూ సాంకేతిక సమస్యలతో రైలు అది కూడా పీక్ అవర్స్‌లో నిలిచిపోతుండటంతో కంగారుపడిపోతున్నారు. ఇప్పుడు అసలే ఎండాకాలం.. రైలు ఆగి.. బోగీల్లో ఇరుక్కుపోతే.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కరి కావాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌కు పరిష్కారమే లేదా అని ప్రశ్నిస్తున్నారు.
-సిటీబ్యూరో, మే 3(నమస్తేతెలంగాణ)
Hyderabad Metro | మెట్రో సేవలపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో రైలు ఎప్పుడూ ఆగిపోతుందోననే టెన్షన్ ప్రయాణికులను వేధిస్తున్నది. ఒక్కసారిగా రైలు మధ్యలోనే ఆగిపోవడంతో రద్దీలో ఇబ్బందిపడుతున్నారు. ఎండాకాలంలో వేసవి తాపాన్ని తప్పించుకోవాలని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
క్యాబ్, ఆటోలతో పోల్చితే ధర తక్కువ ఉండటంతో ఏసీ బోగీల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఇలా సౌకర్యాలు ఉన్నాయని మెట్రోలో వారి సంఖ్య పెరుగుతుంటే..నిత్యం రైలు మొరాయిస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం చూపితే తప్ప.. మెట్రో ప్రయాణం సౌకర్యవంతం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నెలకొసారి అకస్మాత్తుగా పట్టాలపై ఆగిపోతున్న మెట్రోకు చికిత్స చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కువ రద్దీగా ఉండే ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో తరచూ సంభవిస్తున్న బ్రేక్ డౌన్లు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. దీనికి గల కారణాలను అన్వేషించాల్సిన మెట్రో నిర్మాణ సంస్థ… ఆగిపోతే తప్ప.. సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. విద్యుత్ సరఫరాలో వస్తున్న సమస్యలు, మెట్రో ఇంజిన్‌లో కలుగుతున్న సాంకేతిక సమస్యలే అంతరాయాలకు కారణమనే అంచనాలు ఉన్నాయి.
గతంలో జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని నిర్వహణ సంస్థ వెల్లడించింది. వీటికి పరిష్కార మార్గాలను చూస్తున్నామని, నిరంతర రాకపోకలు సాగించేలా మెట్రో రైళ్లను సిద్ధం చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. దీంతో ఒక్కసారిగా ఆగిపోయిన మెట్రో బోగీల్లో అరగంటకు పైగా ఉండాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇక పీక్ అవర్స్‌లో ఇలా నిత్యం జరుగుతుండటంతో మెట్రో ప్రయాణమే భయం గొల్పుతున్నదని ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రయాణ సమయంలో మెట్రో ఆగిపోతే తక్షణమే పరిష్కరించే మార్గమే లేదు. పునరుద్ధరించే వరకు మెట్రో స్టేషన్లు, బోగీల్లో నిలబడి ఉండాలంటే అత్యంత కష్టంగా ఉంటున్నదని నాగోల్ నుంచి హైటెక్ సిటీకి నిత్యం వెళ్లే ఓ ప్రయాణికుడు వాపోయాడు. నెలకోసారి మెట్రో ఆగిపోతుండగా, ఎక్కువగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మార్గంలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.