Hyderabad Metro | సిటీబ్యూరో: ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ మెట్రోను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టేలా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైలు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హెచ్ఎండీఏ, టీజీఐఐసీతో కలిసి నిర్మించేలా ఈ ప్రాజెక్టును చేపట్టనుండగా, ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా కసరత్తు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ కారిడార్‌ను నిర్మించనున్నట్లుగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీ కోసం జరుగుతున్న సర్వే పనుల నేపథ్యంలో… కొంగరకలాన్ దాటి మెట్రో అధికారులతో కలిసి ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్లు ఉండేలా నిర్మిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై మెట్రో రైల్ డిపో మీదుగా, ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డు గుండా పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కి చేరనుంది. బహదూర్ గూడలో ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవునా.. ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్లో మెట్రో రైలుకి కేటాయించిన ప్రాంతంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామన్నారు.
అక్కడి నుంచి సిల్క్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు 328 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 72 అడుగుల వెడల్పుతో ఉండే ప్రాంతంలో భూ ఉపరితల మెట్రో రైలును అభివృద్ధి చేయనున్నారు. విశాలమైన రోడ్డు మధ్యలో రోడ్డుకు సమానంగా మెట్రోకు ఇరువైపులా మూడు లైన్ల విశాలమైన రోడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 22 వేల కోట్లతో మెట్రో మొదటి దశను 69 కి.మీ మేర నిర్మించినట్లుగానే, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు.
ఫేస్-2లో అత్యంత రద్దీ కలిగిన మార్గంగా నాగోల్ శంషాబాద్ లైన్ క్లియరైంది. నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసే ఈ మార్గం పొడువు మొత్తం 36.8 కిలోమీటర్లు కాగా దీని ద్వారా నిత్యం 3.70లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. ఫేస్-2లో కారిడార్-4ను దాదాపు రూ. 11,226 అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. 36.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే ప్రతిపాదిత మెట్రో స్టేషన్ల నిర్మాణంపై కొన్ని మార్పులకు అవకాశం ఉందని తెలిసింది. ఇందులో నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్, బైరామల్‌గూడ, మైత్రీ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, ఓవైసీ హాస్పిటల్, డీఆర్డీవో, బాలాపూర్ రోడ్డు, చాంద్రాయణ్‌గుట్ట, బండ్లగూడ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శాతంరాయి, సిద్దాంతీ, శంషాబాద్, ఎయిర్‌పోర్టు కార్గో, ఎయిర్‌పోర్టు ప్రాంగణం వరకు ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రాథమిక దశలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తున్నారు.