సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ) నగరంలో మెట్రో మార్గాల వెంబడి ఉన్న మాల్స్, మల్టీప్లెక్సులు, కార్యాలయాలతో అనుసంధానం చేసేలా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా కార్యాలయాలకు చేరుకునేందుకు స్కైవాక్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వారి నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్, ల్యాండ్ మార్క్ మాల్ కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మించుకోగా…
అదే తరహాలో ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి దాని సమీపంలో నిర్మాణంలోని వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. ఇదేతరహాలో నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల వద్ద ఉండే కంపెనీలు, భవన నిర్వాహకులు కూడా ముందుకు రావాలని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసేలా స్కైవాక్ లు నిర్మించుకోవాలనుకుంటే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి కె.వి. నాగేంద్ర ప్రసాద్ ను సంప్రదించాలన్నారు.
మెట్రోపై సర్కార్ హ్యాండ్సప్
నగరంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రోకు శంకుస్థాపన పడిందని, నగరంలో మెట్రో పరుగులకు కారణం అప్పటి కాంగ్రెస్ నేతలేనని చెప్పుకునే రేవంత్ రెడ్డి… అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టహాసంగా చేపట్టిన మెట్రో ఫేజ్ – 2 విస్తరణ పనులకు కేంద్ర అనుమతులు తీసుకురాలేకపోతున్నారు. నగరంలో వందల కిలోమీటర్ల మెట్రో లైన్లు నిర్మిస్తున్నామని చెప్పుకుంటూ… అందుకు అవసరమైన డీపీఆర్‌లకు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, బంతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పంపి చోద్యం చూస్తోంది.
డీపీఆర్‌తో కేంద్రానికి చేరి నెలలు గడిచిపోయినా.. ఇప్పటికీ ఉలుకుపలుకు లేదు. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపితే గానీ, హైదరాబాద్ కేంద్రంగా మెట్రో విస్తరణకు తావు లేదు. నిజానికి ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. విస్తరణ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతోనే… డీపీఆర్ తయారీ నుంచి ఆమోదం వరకు ఆలస్యం అవుతుండగా.. అసలు విషయాన్ని మరిచిన కాంగ్రెస్, బీజేపీలు పరస్పర ఆరోపణలతో ప్రాజెక్టును నీరుగారుస్తున్నారు. మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే… కాంగ్రెస్ నిర్లక్ష్యమే మెట్రో విస్తరణకు పెద్ద ఆటంకంగా మారిందని మాటలతో పూట గడిపేస్తున్నారు.