Crime News | సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళల వేషధారణలో షాపు యజమానులను, వాహనదారులను , పాదచారులను వేధిస్తూ.. డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాయాబజార్ హోటల్ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కార్ఖానా పోలీసుల సహకారంతో ఈ బెగ్గర్స్ టీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులను, పాదచారులను తీవ్రంగా వేధిస్తూ, షాపుల్లో డబ్బులు దండుకుంటున్న ఈ గ్యాంగ్ సభ్యులు పురుషులైనప్పటికీ.. మహిళలుగా చెలామణి అవుతున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. అరెస్టయిన వారిలో దిన్న చిత్ర అలియాస్ సురేశ్, ముంతాజ్ అలియాస్ బాషా, అషు అలియాస్ షఫీ, సమీర అలియాస్ ఇషాక్, చాందినీ అలియాస్ కుమార్, జయశ్రీ అలియాస్ రమేశ్, మనీషా అలియాస్ మాల్తేష్ ఉన్నారని డీసీపీ పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి వారిని ప్రోత్సహించవద్దని, ఏదైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని ఆయన కోరారు. వీరిని అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన కె.సైదులు, శ్రీనివాసులు దాసు, జ్ఞానదీప్ బృందాన్ని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.