Family Planning | సిటీబ్యూరో, మే 2, (నమస్తే తెలంగాణ): ప్రతి దాంట్లో లేడీసే ఫస్ట్.. అని ఏ సందర్భంలో అన్నారో గానీ, ప్రేమ, ఆప్యాయతలు చూపించడంతో పాటు కుటుంబం లాంటి సమాజాన్ని కాపాడటంలోనూ నారీమణులే ముందుంటున్నారు. కుటుంబ నియంత్రణలో మహిళలే కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా ఇద్దరు పిల్లలే ముద్దు..ఆ తరువాత వద్దు అంటూ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల్లో పురుషులకంటే అతివలే అధికంగా ఉన్నారు. వైద్యులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా పురుషులు ఈ విషయంలో ముందుకు రావ డం లేదు. మరోవైపు కొందరు మహిళలు తమ భర్తలకు శస్త్ర చికిత్స వద్దంటూ తమకు మాత్రమే చేయాలని చెబుతున్నారు. జిల్లాలోని సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో గతేడాది జనవరి నుంచి నేటి వరకు 325 కు.ని ఆపరేషన్లు నిర్వహించగా, అందులో ఒక్కరంటే ఒక్కరూ కూడా పురుషులు లేకపోవడం గమనార్హ ం.
కుటుంబ నియంత్రణకోసం భార్యాభర్తలు ముఖ్యంగా రెండు పద్ధతులను అనుసరిస్తుంటారు. అందులో మొదటిది ఒక బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డకు సరైన పోషకాలు అందించిన అనంతరం మొదటి బిడ్డకు రెండో బిడ్డకు మధ్యలో రెండు నుంచి మూడేండ్ల గ్యాప్‌ను టెంపరరీ పద్ధతిగా పేర్కొంటారు. ఒక్కరూ లేదా ఇద్దరు సంతానం కలిగిన తరువాత శాశ్వతంగా పిల్లలు వద్దనుకునే దంపతులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండటం గమనార్హం. మహిళలకు ట్యూబెక్టమీ, పురుషులకు వాసెక్టమీ శస్త్ర చికిత్సల ద్వారా కుటుంబ నియంత్రణ చేస్తారు. ముందుగా భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత ఇద్దరిని వైద్యులు ఒప్పిస్తారు. భార్యాభర్తలిద్దరూ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచిస్తారు. చాలా మంది పురుషులు కుటుంబ నియంత్రణకు ముందుకు రావడం లేదు. తమ భర్తలకు కుటుంబ నియంత్రణ వద్దని తానే చేసుకుంటానని చాలా మంది భార్యలు కుటుంబ నియంత్రణకు ముందుకొస్తున్నారు.
గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,626 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించగా వారిలో 9552 మంది మహిళలు కు.ని ఆపరేషన్లు చేయించుకున్నారు. కేవలం 74 మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ చేయించుకున్నారు. ఏడాది కాలంలో కనీసం ఒక్కశాతం పురుషులు కూడా శస్త్రచికిత్స చేయించుకోలేదు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, కింగ్కోటీలోని జిల్లా ఆసుపత్రితో పాటు నిలోఫర్, పేట్లబుర్జ్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల్లో సైతం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. పురుషులకు నిర్వహించే కుటుంబ నియంత్రణలో చర్మాన్ని కత్తిరించకుండా(నో స్కల్పెల్) తేలికపాటి శస్త్ర చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయం తెలియక చాలా మంది పురుషులు అపోహలకు గురై కు.ని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడికి కు.ని చేస్తే తమ వంశం పరువు పోతుందనే భ్రమలో చాలా మంది తల్లిదండ్రులు అపోహలకు గురవుతున్నారు.
జీవన ప్రమాణాలు రోజురోజుకు మారుతున్న తరుణంలో పిల్లల విషయంలో భార్యాభర్తలు ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. చిన్న కుటుంబం చింతలేన్ని కుటుంబమనే నినాదంతో ముందుకుసాగాలి. కుటుంబ నియంత్రణలో ఎలాంటి అపోహలు లేకుండా మహిళలతో పాటు పురుషులు కూడా ముందుకు రావాలి. చదువుకున్న పురుషులు సైతం ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. సమాజానికి మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు రండి.
-డాక్టర్ జె. అనురాధ, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్