హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో (Hayathnagar) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) వైద్య విద్యార్థిని (Medical Student) మృతిచెందారు. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. యంసాయని ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నది. సోమవారం ఉదయం తన తండ్రి పాండుతో కలిసి హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఐశ్వర్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె తండ్రిని మరో దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.