ఉద్ధృతి తగ్గుముఖంతో క్లినిక్‌లు పునఃప్రారంభం
హైదరాబాద్ జిల్లాలో 7 కేంద్రాల్లో సేవలు
మార్చి 1 నుంచి మరో 18 క్లినిక్‌లు ప్రారంభం
వారానికి 5 రోజులు..రోజుకు 3 గంటలు వైద్యం
ప్రస్తుతం ఏడు కేంద్రాల్లో కొనసాగుతున్న వైద్య సేవలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో బస్తీదవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సూపర్‌స్పెషాల్టీ సేవలను సైతం అందించే క్రమంలో నగరంలోని 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 143 బస్తీ దవాఖానల్లో ట్రెషరీ, జిల్లా దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో రెండేండ్ల క్రితం గ్రేటర్లో ఈవినింగ్ క్లినిక్‌లను సైతం ప్రవేశపెట్టింది. అయితే 2020 మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించడంతో కొన్ని క్లినిక్‌ల సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. మరికొన్ని క్లినిక్‌లు తెరుచుకోవాల్సి ఉంది.
సాయంత్రం వేళల్లో సేవలు..
ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనా లేదా ఉద్యోగులు, కార్మికులు అస్వస్థత చెందినా ఇక వారు తమ రోజువారీ పనులు మానుకోకుండానే వైద్యం చేయించుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు పగలు సమయంలోనే అందుబాటులో ఉంటాయి. కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, దినసరి కార్మికులు చిన్నపాటి అనారోగ్యానికి గురై పగటి పూట దవాఖానకు వెళ్లాల్సి వస్తే ఆ రోజు పనులు మానుకోవాల్సిన పరిస్థితి. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలు, ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా దవాఖానలు, ఏరియా వైద్యశాలలతో పాటు ఉస్మానియా, గాంధీ లాంటి టీచింగ్ హాస్పిటళ్లలో ఓపీ సేవలను అందుబాటులో ఉంచుతూనే మరోపక్క కార్మికులు, ఉద్యోగుల కోసం ఈవినింగ్ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అందుబాటులోకి స్పెషాల్టీ సేవలు..
ముఖ్యంగా ఈవినింగ్ క్లినిక్‌ల్లో అధికారులు స్పెషాల్టీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే గైనిక్, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, ఆర్థో తదితర విభాగాల సేవలను అందిస్తున్నారు.
త్వరలో మరో 18 క్లినిక్‌లు..
2019లో ఈవినింగ్ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఏడింటి ద్వారా సేవలు అందిస్తున్నది. హైదరాబాద్ జిల్లాకు 25, రంగారెడ్డి జిల్లాకు 10, మేడ్చల్‌కు 10 చొప్పున క్లినిక్‌లు మంజూరు కాగా.. ఇందులో తొలి విడుతగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఏడు క్లినిక్‌లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. మరో 18 క్లినిక్‌లను మార్చి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
వారానికి ఐదు రోజులు..
గతంలో వారానికి మూడు రోజులు మాత్రమే ఈవినింగ్ క్లినిక్‌లు సేవలు అందించేవి. ప్రస్తుతం వాటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు మరో రెండు రోజులు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఐదు రోజుల పాటు పని చేయడంతో పాటు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.