ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : నిమ్స్ దవాఖానలో ఏ ఏజెన్సీ వచ్చినా సెక్యూరిటీ గార్డు జీవితాలు మారడం లేదు. గతంలో రేణుకా సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కోట్లాది రూపాయలు పీఎఫ్‌లను ఎగ్గొట్టి బిచానా ఎత్తివేసింది. తాజాగా విజయవాడకు చెందిన ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ సైతం సెక్యూరిటీ గార్డులను ముంచినట్లు చెబుతున్నారు.
ఆ ఏజెన్సీ కాలపరిమితి ముగిసిపోగా, సుమారు మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టినట్లు సెక్యూరిటీ గార్డులు తెలిపారు. సుమారు మూడు కోట్ల పీఎఫ్ డబ్బుల గోల్‌మాల్‌కు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు లేబర్ కమిషన్ నుంచి నోటీసులు సైతం జారీ అయినట్లు తెలిసింది. ఇలాంటి సంస్థకు నిమ్స్‌ను అప్పగించడం వెనుక ఉన్న రహస్యమేమిటనేది తెలియాల్సి ఉంది.
అయితే ప్రస్తుత కార్తీకేయ ఏజెన్సీ కాలపరిమితి సైతం జూలైలోనే ముగిసినట్లు తెలుస్తోంది. ఇంత వరకు నిమ్స్ కొత్త టెండర్లు పిలవకుండా అదే సంస్థను కొనసాగిస్తోందని సెక్యూరిటీ గార్డులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులకు వేతనాలు ఆలస్యమైన విషయంపై నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పను వివరణ కోరగా, త్వరలోనే వారి వేతనాలు ఖాతాల్లో పడుతాయని తెలిపారు.
వేతనాలు చెల్లించని ఏజెన్సీల బాధ్యత వైద్యాధికారిదే…
నిమ్స్ సెక్యూరిటీ గార్డులు ధర్నా చేస్తే ఓ వైద్యాధికారి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరించినట్లు తెలిసింది. వేతనా లు ఇవ్వకుంటే ధర్నా చేస్తారా అంటూ హుం క రించినట్లు సెక్యూరిటీ గార్డు లు తెలిపారు. మరో సారి ధర్నా చేస్తే బాగుండదని బెదిరిస్తూ సంతకాలు తీసుకొని వెనక్కి పంపించినట్లు సమాచారం. పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొన్న ఆ వైద్యాధికారి చేతుల్లోనే ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చొరవతోనే పీఎఫ్‌లు, వేతనాలు ఎగ్గొట్టిన సంస్థలు టెం డర్ల ద్వారా నిమ్స్ బాధ్యతలను ద క్కించుకుంటున్నట్లు సమాచారం.